ప్రజలపై ఛార్జీల భారం: కేసీఆర్ నేరుగా, ఏపీ ఎండీ నోట
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులకు 43 శాతం, 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా? అనే చర్చ సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఛార్జీలు పెరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సాంబశివ రావు మాట్లాడారు. కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. అందులోను ఏపీ లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచవచ్చునని చెబుతున్నారు.
అయితే, ఛార్జీలు పెంచుకొనేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. కార్మికులతో చర్చ అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవ రావులు మాట్లాడుతూ... ఆర్టీసీ నష్టాలబాటలో ఉందని, ఇప్పటికే రూ.4వేల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందని అన్నారు.

ఆదుకుందామంటే ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. అయినప్పటికీ కార్మికులకు అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి 43 శాతం ఫిట్మెంట్‌కు అంగీకరించారన్నారు. బస్సు చార్జీలు పెంచే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా 'ప్రస్తుతానికి' అలాంటి ఆలోచన లేదని మంత్రులు సమాధానమిచ్చారు.
కార్మిక సంఘాలిచ్చిన విలువైన సూచనలు తీసుకొని సంస్థను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు మరింత కష్టపడి పని చేసి సంస్థను బలోపేతం చేయాలన్నారు. సమ్మెతో రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
మరోవైపు, తెలంగాణలో మాత్రం కచ్చితంగా ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఫిట్మెంట్ నేపథ్యంలో పడే భారాన్ని తట్టుకునేందుకు వీలుగా బస్సు చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
15 శాతం వరకు చార్జీలు పెంచే అవకాశముందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఫిట్మెంట్ భారం నేపథ్యంలో చార్జీలు పెంచే అవకాశముందా? అని ప్రశ్నించగా... కొంతమేరకు పెంచక తప్పదని, ఆర్టీసీ యాజమాన్యం చూసుకుంటుందని, కార్మికులు కూడా ప్రజల్లో భాగమేనని, వారి భారాన్ని ప్రజలు కూడా పంచుకోవాలని, లేకుంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని కేసీఆర్ ప్రశ్నించారు. భయపడే స్థాయిలో కాకుండా, స్వల్పంగా పెంచుతామన్నారు.
విమానాల్లో ఉన్నట్లుగా డైనమిక్ చార్జీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అంటే బస్సుల్లో సీట్లు నిండేకొద్దీ, మిగిలిన సీట్ల చార్జీ పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి చార్జీలు పెంచే యోచన లేదని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తాండూరులో అన్నారు. సమ్మెతో రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications