టిఆర్ఎస్ ఎంపీలకు ముందే తెలుసా: అందుకేనా?
న్యూఢిల్లీ: సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్న సభ్యులపై సస్పెన్షన్ వేటు పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) లోకసభ సభ్యులకు ముందే తెలుసా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వారు సోమవారంనాడు ఆందోళనను విరమించి, సమావేశాల నుంచి బయటకు వెళ్లినట్లు భావిస్తున్నారు. హైకోర్టు విభజనను కోరుతూ వారు పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్సిస్తున్న విషయం తెలిసిందే.
హైకోర్టు విభజన కోసం ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ నాలుగురోజులు ఆందోళన చేశారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్ ఎంపీలతో కలవకుండా స్పీకర్‌కు కుడివైపు అధికార సభ్యుల బల్లలకు సమాంతరంగా నిలబడి మౌనంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు.

సోమవారం టీఆర్‌ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నామని, కాబట్టి ప్లకార్డులతో నిరసన తెలిపితే వారితోపాటు అందరిపైనా వేటు వేస్తామని తెలిపారు. దీంతో జితేందర్ రెడ్డి, కవిత సహా ఎంపీలంతా సభలోంచి బయటకు వెళ్లిపోయారని అంటున్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా సరే ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన ఆపేదిలేదని టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ మీడియాతో అన్నారు.
సిపిఎం సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలుపుతుండగా వారికీ రూఢీ ఇదే విషయాన్ని చెప్పారు. అయినా వారు మాత్రం వెనక్కు వెళ్లలేదు. వెల్‌లోనే నిరసన చేపట్టినా వారిపై వేటు వేయలేదు. రూఢీ సభ్యుల్ని బెదిరించారంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జునఖర్గే సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications