రోజంతా హైడ్రామా: బెజవాడలో నన్నపనేని ఓవరాక్షన్!
విజయవాడ: కోర్టు విచారణలో ఉన్న ఆస్తి తగాదాలో జోక్యం చేసుకుని, పోలీసు ఉన్నతాధికారులకు, మంత్రులకు ఫోన్లు చేసి పెద్ద రాద్ధాంతమే చేశారు. రాష్ట్ర మహిళా కార్పొరేషన చైర్‌పర్సన్‌గా నన్నపనేని రాజకుమారి శనివారం విజయవాడలో చేసిన హల్ చల్ చేశారు.
వివరాల్లోకి వెళితే.... గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన కొల్లి పాండురంగారావు, గోపాలరావు, బుచ్చికోటయ్యలు అన్నదమ్ములు. వీరి తండ్రి కొల్లి వెంకటపద్మనాభం భూస్వామి. ఈ ముగ్గురూ కలిసి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 1986లో కృష్ణవేణి పౌల్ట్రీ నీడ్స్ అనే సంస్థను స్థాపించారు.
కాగా, 1994లో పద్మనాభం మరణించారు. దీన్నీ అవకాశంగా తీసుకున్న బుచ్చికోటయ్య 1995లో ఫోర్జరీ సంతకాలతో వ్యాపారాన్ని తప్పు దోవ పట్టించారు. పద్మనాభం బతికి ఉన్నట్లు కాగితాలు సృష్టించి కొత్త భాగస్వాములను సంస్థలోకి తీసుకున్నారు. 2009 సంస్థ నుంచి పాండురంగారావు, గోపాలరావులను తొలగిస్తున్నట్లు కాగితాలు సృష్టించి మొత్తం సంస్థ తనకు చెందినట్లుగా అందులో రాసుకున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న పాండురంగారావు, గోపాలరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వారిద్దరూ ఆరోపించినట్లుగానే.. బుచ్చికోటయ్య డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో తేలింది. దీంతో కోర్టు వారిద్దరికీ అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం బుచ్చికోటయ్య.. తన సోదరులను విజయవాడలోని ఇంటికి రాజీకోసం పిలిచి వారితో గొడవకు దిగారు. విజయవాడకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోయారు. తన భార్యను గృహ నిర్భంధం చేశారంటూ మీడియాకు, రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి హడావుడి సృష్టించారు.
అయితే దీనిపై సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా తలుపులు తెరిచే ఉన్నాయి. దీంతో వారు ఇది గృహనిర్బంధం కాదని తేల్చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అక్కడ పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న నన్నపనేని శనివారం అక్కడకు చేరుకుని హడావుడి సృష్టించారు.

నన్నపనేని తీరుతో విసిగిపోయిన పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన్‌గా ఇక్కడకు వచ్చానని.. తనకు అన్యాయం జరుగుతోందని, గృహ నిర్భంధం చేశారని బుచ్చికోటయ్య భార్య ఫిర్యాదు చేస్తేనే ఇక్కడకు వచ్చానని నన్నపనేని రాజకుమారి మీడియాకు వివరించారు.
కేబినెట్ హోదా ఉన్న తాను ఇక్కడకు వస్తే పోలీసులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదన్నారు. వారి ఆస్తిగొడవకూ తనకూ ఏ సంబంధం లేదన్న ఆమె.. ఒక మహిళకు అన్యాయం జరుగుతోందని, ఆమెపై దాడి చేసేందుకు అవకాశం ఉన్న వ్యక్తులు గుమ్మం ముందే కూర్చున్నారని, వారిని అరెస్టు చేయాలని పోలీసులకు ఎంతచెప్పినా వినటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై డీజీపీ, హోంమంత్రితో మాట్లాడినా.. విజయవాడ సీపీ గౌతం సవాంగ్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. బెజవాడ పోలీసుల ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని, దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే సీఎం దగ్గరకు తీసుకెళతానని చెప్పారు.












Click it and Unblock the Notifications