పక్కింటి కుర్రాడు విదేశాలకు వెళ్లొద్దని ఆమె ఏం చేసిందంటే..
ఢిల్లీ: పక్కింట్లో ఉండే విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నాడు. అతను అలా వెళ్లడం ఇష్టం లేని ఓ మహిళ.. అతని బ్యాగులో బాంబు ఉందని విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇది శుక్రవారం ఉదయం జరిగింది.
బల్‌రాజ్ సింగ్ అనే యువకుడు సిడ్నీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అంతలో అతని బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నాయని ఓ మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

మరికొద్దిసేపట్లో బయలుదేరనున్న సిడ్నీ విమానంలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బల్‌రాజ్ సింగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పాస్‌పోర్టు, వీసా, లగేజ్ తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు పూర్తయిన అనంతరం అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులకు ఫలానా ఫోన్ నెంబర్ నుంచి బల్‌రాజ్ సింగ్ లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఫోన్ వచ్చిందని తెలిపారు.
దీంతో ఆ ఫోన్ నెంబర్‌ను గుర్తు పట్టిన అతని కుటుంబ సభ్యులు అది తమ పక్కింటి ఆవిడ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అని తెలిపారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన కుమార్తె సిడ్నీలో ఉన్నత విద్యకు వెళ్లాల్సి ఉందని, ఆమెకు సీట్ రాలేదని, తమ కుమార్తెకు దక్కనిది పక్కింటి కుర్రాడికి దక్కడాన్ని సహించలేక అలా ఫోన్ చేసినట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications