సూపర్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ 'మ్యాజిక్ రైస్'.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే రెడీ..
ఉరుకులు పరుగుల జీవితంలో టిఫిన్ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. దాంతా చాలా మంది బయట తిని అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే రాత్రి మిగిలిన అన్నంతో ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే ఈ మ్యాజిక్ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాజిక్ రైస్ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
మ్యాజిక్ రైస్ కు కావాల్సిన పదార్థాలు చూస్తే.. రాత్రి మిగిలిన అన్నం 2 కప్పులు, నూనె 2 టీ స్పూన్ లు, నిమ్మరసం 2 టీ స్పూన్ లు, పచ్చిమిర్చి రెండు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు తగినంత, ఆవాలు అర టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, మినప్పప్పు అర టీ స్పూన్, పచ్చిశనగపప్పు అర టీ స్పూన్, పల్లీలు లేదా జీడిపప్పు ఒక టీ స్పూన్ తీసుకోవాలి.
మ్యాజిక్ రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే పల్లీలు లేదా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి.

ఇప్పుడు అందులోనే పసుపు వేసి.. సిద్దంగా పెట్టుకున్న అన్నాన్ని వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అన్నం, తాలింపు పూర్తిగా కలిసే వరకూ కొద్దిసేపు అలాగే వేడి చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. అంతే సూపర్ టేస్టీ మ్యాజిక్ రైస్ రెడీ అయినట్టే.. ఇది బ్రేక్ ఫాస్ట్ తో పాటు లంచ్ లోనూ టేస్టీగానే ఉంటుంది.












Click it and Unblock the Notifications