అరటి ఆకులో తింటే - సంప్రదాయం వెనుక సైన్స్, ఆరోగ్యం..!!
అరటి ఆకుపై భోజనం. ఎంతో కాలంగా ఉన్న సంప్రదాయం. శుభకార్యాల సమయంలో అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించడం ఆనవాయితీగా పాటిస్తారు. ఈ సంప్రదాయం వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా వినియోగిస్తున్న ప్రస్తుత కాలంలో అరటి ఆకులో తినటం ద్వారా తెలియని విధంగా పీచు పదార్ధం శరీరానికి మేలు చేస్తుంది. అరటి ఆకులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్య పరంగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేక సందర్భాల్లో అరటి ఆకు భోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. శుభాకార్యాల సమయంలో అరటి ఆకులో భోజనాలు శుభప్రదంగా భావిస్తారు. ఇది సంప్రదాయమైనా ఇందులో సైన్స్ తో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటి ఆకుపై భోజనం చేసేటప్పుడు దాని ఉపరితలంపై ఉండే కొన్ని పాలీఫెనాల్ సమ్మేళనాలు ఆహారంలోకి స్వల్పంగా చేరుతాయి. వీటిలో కాటెచిన్స్, గాలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడతాయి. వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు, ఈ పోషకాలు ఆహారంలో కలిసి మన శరీరానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అరటి ఆకులో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యం పై సానుకూల ప్రభావం
కాగా, అరటి ఆకులో తినే అలవాటు శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలో మంచి శక్తిని పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి ఆకులో ఉండే సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వినియోగించడం, నిద్రలేమి వంటివి శరీరంపై ప్రతికూల ప్రభావం యువతో ప్రధాన సమస్యగా మారుతున్న వేళ అరటి ఆకు పైన ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఈ సమస్యలకు చెక్ పెడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు అరటి ఆకులో ఉండే సమ్మేళనాలు నియంత్రణకు తోడ్పతాయని చెబుతున్నారు. దీంతో.. వారానికి కనీసం ఒకసారైనా అరటి ఆకుపై భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
