బరువు తగ్గాలనుకుంటున్నారా?
దాహంగా అనిపించినప్పుడు కొందరు నీళ్లకు బదులుగా శీతల పానీయాలు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగేస్తుంటారు. వీటితో అప్పటికి దాహం తీరుతుంది. కానీ వీటివల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. చక్కెరను కలుపుతారు కాబట్టి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దాహం వేసినప్పుడు మంచినీళ్లు మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందిపై ఈ విషయంలో సర్వే నిర్వహించారు.
సర్వేలో పాల్గొన్నవారంతా రోజుకు 4.2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకున్నారు. నీళ్లు ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకున్నారు. రోజుకు 3 కప్పులు ఎక్కువగా నీరు తాగితే 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గాలనుకునేవారు వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగుతుండాలి. ఈసారి దాహంగా అనిపించినప్పుడు శీతల పానీయాలవైపునకు వెళ్లకుండా మాములు మంచినీళ్లే తాగండి. దీనివల్ల దాహం తీరడంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

నీరు ఎక్కువగా తాగడంవల్ల తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. రక్తపోటు, గుండె వేగం నియంత్రణలో ఉంటాయి. కణజాలాలను, అవయవాలను రక్షిస్తుండటంతోపాటు కీళ్లు ఒరుసుకు పోకుండా చూస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే తల తిప్పడం, తికమకగా ఉండటం, రక్తపోటు పడిపోవడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు 2 లీటర్ల మంచినీరైనా తాగుతుండాలి. వ్యాయామం చేసేవారు, శారీరకంగా శ్రమ చేసేవారు చెమట రూపంలో బయటకు వెళుతున్న నీటిని ఎప్పటికప్పుడు భర్తీచేసుకోవాలి. మూత్రం ముదురు రంగులో రాకుండా చూసుకుంటే శరీరానికి తగినంత నీరు అందుతోందని అర్థం.












Click it and Unblock the Notifications