పెరుగును తీసుకోకపోతే చాలా కోల్పోయినట్టే.. !!
మన రోజువారీ సాంప్రదాయ ఆహారంలో పెరుగు, మజ్జిగలకు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. పూర్వీకుల కాలం నుండి ఈ రెండు పదార్థాలను జీర్ణక్రియను మెరుగుపరిచే సహజసిద్ధమైన ఔషధాలుగా భావిస్తూ వస్తున్నారు. మన శరీరంలోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల పరంగా పెరుగు తింటే మంచిదా లేదా మజ్జిగ తాగితే మంచిదా అనే సందేహం చాలామందిలో నిరంతరం తలెత్తుతుంటుంది. మన నిత్య జీవితంలో ఉండే శారీరక శ్రమ, అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవడం ముఖ్యం.
ఈ రెండింట్లో కూడా శరీరానికి ఎంతగానో మేలు చేసే ప్రోబయాటిక్స్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తాయి. పెరుగు, మజ్జిగ రెండు కూడా పేగుల్లోని ఉపయోగకరమైన గట్ మైక్రోబయోటా సమతుల్యతను పరిరక్షిస్తాయి. గడ్డ పెరుగు సాంద్రత పరంగా చాలా చిక్కగా, అధిక పోషక విలువలతో కూడి ఉంటుంది. పెరుగులో ఆరోగ్యకరమైన ప్రోబయాటిక్స్ మాత్రమే కాకుండా శరీర ఎదుగుదలకు అత్యవసరమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12 వంటి ముఖ్యమైన పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.

రోజువారీ సమతుల్య ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన తక్షణ శక్తిని పొందవచ్చు. రోజంతా అలసట లేకుండా ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి సజీవ క్రియాశీల బ్యాక్టీరియా పేగుల్లో హానికర క్రిములను నశింపజేస్తుంది. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, జీర్ణక్రియ సులభంగా సాగడానికి దోహదపడుతుంది. క్రమం తప్పకుండా సహజమైన పెరుగును తీసుకోవడం వల్ల శరీరంలో సహజ రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
తరచూ మలబద్ధకం సమస్యతో బాధపడేవారినికి పెరుగు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తోన్నారు. సాధారణ మజ్జిగతో పోల్చి చూస్తే పెరుగులో ప్రొటీన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాల బలానికి, శరీర ధృడత్వానికి అలాగే దెబ్బతిన్న కణజాలాల వేగవంతమైన మరమ్మతుకు ప్రొటీన్లు అత్యవసరం. పెరుగు తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీనివల్ల మధ్య మధ్యలో అనవసరమైన ఆకలి నియంత్రణలోకి వస్తుంది.
అనారోగ్యం నుంచి కోలుకుంటున్న బలహీనమైన రోగులు, నిత్యం శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి పెరుగు ఒక అద్భుతమైన పోషకాహారంగా పనిచేస్తుంది. పెరుగును బాగా చిలకడం ద్వారా పల్చటి మజ్జిగ తయారవుతుంది. దీనికి జీలకర్ర పొడి, అల్లం ముక్కలు, కొత్తిమీర లేదా పుదీనా రసం వంటి సహజసిద్ధమైన మసాలా దినుసులను జోడించడం వల్ల మరింత రుచిగా మారుతుంది. మజ్జిగ చాలా తేలికగా ఉండటంతో పాటు అత్యంత సులభంగా జీర్ణమవుతుంది.
మజ్జిగలో నీటి శాతం అత్యధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవడానికి మజ్జిగ అత్యుత్తమ సహజసిద్ధమైన పానీయం. ఇందులో ఉండే వివిధ రకాల ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించి, ఎండదెబ్బ తగలకుండా కాపాడతాయి. శరీరానికి అవసరమైన తక్షణ చైతన్యాన్ని ఇవ్వడం, అలసటను పారద్రోలడంలో దీనికి సాటిలేదు.
బరువు తగ్గాలనుకుంటునే వారికి మజ్జిగ అత్యుత్తమం. ఇందులో కొవ్వు, క్యాలరీల శాతం చాలా తక్కువగా ఉంటుంది. శరీర బరువును సులభంగా నియంత్రణలో ఉంచడానికి, పేరుకుపోయిన అధిక వేడిని తగ్గించడానికి మజ్జిగ తోడ్పడుతుంది. శరీరానికి ఎక్కువ ప్రొటీన్లు, ఎముకలను దృఢపరిచే కాల్షియం అవసరమైతే మాత్రం రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, దంతాల ఆరోగ్యానికి పెరుగు ఎంతో శ్రేయస్కరం.















Click it and Unblock the Notifications