డయాబెటిస్ ఉన్నవారికి ఏ పండ్లు బెస్ట్..!?
డయాబెటిస్. ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న సమస్య. మారుతున్న జీవన శైలి.. ఒత్తిడితో వయసు తో సబంధం లేకుండా అనేక మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ ను గుర్తించిన సమయం నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. వైద్యులు సూచించిన మందులతో పాటుగా జీవన శైలి.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అదే విధంగా డయాబెటిస్ ఉన్న వారు పండ్లు తీసుకోవటం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. షుగరు ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మరియు ఎక్కువ ఫైబర్ ఉన్న పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్న వారు పండ్లలో సహజ చక్కెర ఉంటుందని వాటిని తినడానికి ఇష్టం చూపించరు. కాగా, పండ్లలో కార్బొహైడ్రేట్లతోపాటు శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పదార్థం కూడా ఉంటాయి. ముఖ్యంగా పండ్లను రసం రూపంలో కాకుండా పూర్తిగా తినడం వల్ల అందులోని పీచు చక్కెర రక్తంలోకి వేగంగా చేరకుండా జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో రక్తంలో షుగరు స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు పండ్ల రకం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.అయితే.. మధుమేహం ఉన్నవారికి జామపండు మంచి ఎంపికగా పేర్కొంటున్నారు. ఇందులో పీచు అధికంగా ఉండడంతోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, కరిగే పీచు అధికంగా ఉండి చక్కెర తక్కువగా ఉంటుంది.

నిపుణుల సూచనలు
కాగా.. పియర్‌లో పీచు ఎక్కువగా ఉండడంతో రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల కావడానికి సహాయపడుతుంది. యాపిల్‌ను తొక్కతో తినడం వల్ల పీచు, ఇతర పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. నారింజలో పీచు, విటమిన్ సి, పొటాషియం ఉంటాయి. అయితే నారింజ రసాన్ని తీసుకోవడం కంటే పండును పూర్తిగా తినడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, కివిలో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, పీచు ఉంటాయి. పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, సహజ ఎంజైములు ఉంటాయి. అయితే సహజ చక్కెరలు ఉండడంతో పరిమాణంపై నియంత్రణ అవసరం. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, ఇనుము ఉన్నప్పటికీ ఇతర కొన్ని పండ్లతో పోలిస్తే సహజ చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవాలి. మామిడిపండులో సహజ చక్కెర, గ్లైసెమిక్ సూచీ ఎక్కువగా ఉండడంతో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. బెర్రీలు, చెర్రీ లు, యాపిల్ వంటి తక్కువ గ్లైసెమిక్ సూచీ కలిగిన పండ్లను ఎంచుకోవచ్చు. మధుమేహం ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే పండ్లను వినియోగించటం మంచిది.













Click it and Unblock the Notifications
