కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!!
రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ గుడ్డును తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అయితే గుడ్డుతో అనేక రకాల వంటలు చేస్తుంటారు. అందులో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా..? కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే కోడిగుడ్లు నాలుగు, వెల్లుల్లి రెబ్బలు అర కప్పు, ఉల్లిపాయలు రెండు పెద్దవి, టమాటోలు రెండు, చింతపండు నిమ్మకాయంత సైజులో, కారం రెండు టేబుల్ స్పూన్ లు, పసుపు పావు టీ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు రెండు రెబ్బలు తీసుకోవాలి.
ఇప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు తయారీ విధానం చూస్తే ముందుగా ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే బాణిలో మరికొంత నూనె పోయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పసుపు వేసి మెత్తగా మగ్గించుకోవాలి.

ఇక ఆ మిశ్రమంలో కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసి నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు వేయించిన కోడిగుడ్లను అందులోనే వేయాలి. ఇప్పుడు మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకూ మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి పులుసు తయారైనట్టే..












Click it and Unblock the Notifications