రోజంతా నోరాడిస్తున్నారా?... అయితే ఇవి మీకోసమే!
మిఠాయిలు, జంతికల వంటి చిరుతిళ్లను కొందరు ఎప్పుడూ నోట్లో వేసుకొని నములుతూనే ఉంటారు. మనం తింటున్నది చాలా తక్కువే కదా.. ఏమీకాదులే అనుకుంటారు. అయితే అది సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సహేతుకమైన కారణాలున్నాయంటున్నారు.
* మనం ఏది తిన్నా రెండు గంటల వరకు పళ్ల మీద ఎనామిల్ క్షీణిస్తూ వస్తుంటుంది. అందుకే భోజనం చేసిన తర్వాత దంతాలు శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలా కాకుండా తరుచుగా ఏదో ఒకటి నములుతూ, బ్రష్ చేసుకోనివారికి పళ్లపై ఎనామిల్ దెబ్బతింటుంది. ఆ ప్రక్రియ రోజంతా కొనసాగితే దంతాలు క్షీణించే ముప్పు కూడా పెరుగుతుంది.
* మనం ఏదైనా తినడం ప్రారంభించిన వెంటనే రక్తంలో ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. కొన్ని మిఠాయిలు ప్లేట్‌లెట్ కణాలు జిగురుగా అయ్యేలా చేస్తాయి. దీంతో రక్తం గడ్డ కట్టే స్వభావం పెరిగి గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది.

* మనం ఏదైనా తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేయడంతోపాటు అదేపనిగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటే రక్తంలో ఇన్సులిన్ మోతాదులు ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఇది చాలా ప్రమాదం. ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యల ముప్పు పెరిగేలా చేస్తుంది.
* చిరుతిళ్ల వల్ల మరో సమస్య ఉంది. కడుపు నిండినట్లుగా అనిపించకపోవడంతో ఎక్కువెక్కువగా తింటుంటారు. ఇది బరువు తగ్గాలనుకునేవారికి చేటు చేస్తుంది.
ఎప్పుడూ ఏదో ఒకటి తినడంవల్ల నిద్ర అస్తవ్యస్తమవుతుంది. పోషకాలు లేని జంక్ ఫుడ్ వల్ల పోషణ లోపానికి దారితీస్తుంది.
* ఏదైనా తిన్నప్పుడు జీర్ణకోశానికి రక్తం ఎక్కువగా సరఫరా అయి కండరాలు, మెదడుకు తక్కువగా అందుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే రక్తసరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. అదేపనిగా తినటం వల్ల అజీర్ణం, ఛాతీలో మంట వంటి సమస్యలకూ దారితీస్తాయి.












Click it and Unblock the Notifications