'రాగి ఆవిరి కజ్జికాయలు'.. ఇలా చేస్తే జ్యూసీజ్యూసీగా ఉంటాయి..!
కజ్జికాయలు అనగానే చాలామందికి నోరూరుతుంది. కజ్జికాయలు రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా ఉండే కజ్జికాయలను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటుంటారు. ఇక పండగలు, శుభకార్యాల సమయంలో అయితే ప్రతి ఒక్కరూ వీటిని తయారు చేస్తుంటారు.
అయితే కజ్జికాయల్లో కొన్ని రకాలు ఉంటాయి. పాకం కజ్జికాయలు, కోడిగుడ్డు కజ్జికాయలు, నువ్వుల కజ్జికాయలు, డ్రైఫ్రూట్స్ కజ్జికాయలు, కోవా కజ్జికాయలు ఇలా అనేక రకాలుగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా రాగి ఆవిరి కజ్జికాయలను టేస్ట్ చేశారా..? ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాక వీటిని తింటే పోషకాలు లభిస్తాయి. మరి ఈ రాగి ఆవిరి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాగి ఆవిరి కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా రాగిపిండి ఒక కప్పు, నీరు ఒక కప్పు, ఉప్పు చిటికెడు, నూనె లేదా నెయ్యి ఒక టేబుల్ స్పూన్, తురిమిన ఎండు కొబ్బరి ఒక కప్పు, తురిమిన బెల్లం ఒక కప్పు, యాలకుల పొడి ముప్పావు కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా ఒక గిన్నెలో తురిమిన ఎండు కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి అన్నీ బాగా కలిసేలా మిక్సింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు రాగిపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిపై మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల తయారీ విధానం చూస్తే రాగి పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి ఉండను పూరలా ఒత్తుకోవాలి.

మధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి- బెల్లం పూర్ణం పెట్టుకోవాలి. అలా అంచులకు కొద్దిగా నీరు రాసి కజ్జికాయ ఆకారంలో మలుచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకుని పాత్రకు కొద్దిగా నూనె రాయాలి. ఇప్పుడు తయారు చేసుకున్న కజ్జికాయలను ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకుని సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ఆరోగ్యానికి మేలు చేసే రాగి ఆవిరి కజ్జికాయలు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications