ఉప్పు Vs చెక్కర: వీటిల్లో ఏది ఎక్కువ ప్రమాదకరం..!?
ఉప్పు, చక్కెర ఈ రెండు మన కిచెన్ గదిలో ఖచ్చితంగా ఉండేవి. ఆరోగ్య పరంగా మాత్రం ఈ రెండు శత్రువులే. మధు మేహం, గుండె జబ్బులకు కారణం అవుతాయి. శరీరంలోని ప్రధాన భాగాల పైన ఈ రెండు ప్రభావం చూపుతాయి. ఒక వయసు వచ్చిన వారు ఈ రెండు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఈ రెండు ప్రధాన కారణాలుగా గుర్తించారు. మధు మేహం, గుండె జబ్బులకు కారణంగా నిలుస్తున్నాయి. వీటి వినియోగం పైన నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఉప్పు- చక్కెర పరిమితికి మించి తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మరింత సమస్యగా మారుతుంది. అధిక ఉప్పు శరీరంలో నీటిని నిల్వ చేసేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కూడా ఉప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదనపు చక్కెర తీసుకోవడం బరువు పెరగడం, ఊబకాయం, టైప్-2 మధుమేహం, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నీ కాలక్రమంలో గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. గుండె ఆరోగ్యం కోసం ఉప్పు లేదా చక్కెర ఒక్కదానిపైనే దృష్టి పెట్టకుండా మొత్తం ఆహార విధానాన్ని మార్చుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

నిపుణుల సూచనలు
కాగా.. నిత్యం ఆహారంలో కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి తాజా, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును ఎక్కువగా వాడటం వల్ల గుండెకు మాత్రమే కాదు ఇతర అవయవాలకు కూడా హానికరమే. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా ఉప్పు తీసుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ కి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక రోజుకు చక్కెర 30 గ్రాములు మించకుండా, ఉప్పు ఒక స్పూన్ మించకుండా తీసుకుంటే శరీరంలో రక్త పోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని సూచిస్తున్నారు. శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువు, ధూమపానాని కి దూరంగా ఉండడం, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు పేర్కొంటున్నారు.













Click it and Unblock the Notifications
