'తోటకూర చికెన్'.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..!
చికెన్ ను చాలామంది ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ ఫేవరెట్ ఫుడ్ గా ఉంటుంది. చికెన్ ను ఎన్ని రకాలుగా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. మరి తోటకూర, చికెన్ కాంబోను ఎప్పుడైనా ట్రై చేశారా..? నోరూరించే తోటకూర చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
తోటకూరతో నోరూరించే కమ్మని 'చికెన్ కర్రీ' తయారు చేసుకోవడానికి గల పదార్థాలు ఓ సారి చూస్తే.. చికెన్ అరకిలో, తోటకూర తురుము నాలుగు లేదా ఐదు కప్పులు, నూనె తగినంత, ఎండుమిర్చి ఎనిమిది, ధనియాలు, కారం తగినంత, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ లు తీసుకోవాలి.
తయారీ విధానం చూస్తే ముందుగా.. తోటకూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలాగే చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులోనే ఎండుమిర్చి, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం పేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించాలి.

ఆ మిశ్రమంలో కడిగిపెట్టుకున్న చికెన్, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలా కలిపి మూత పెట్టి చికెన్ ను ఉడికించుకోవాలి. అలా చికెన్ ముక్కలు 50 నుంచి 60 శాతానికి ఉడికే వరకూ కుకింగ్ చేసుకోవాలి. చికెన్ ఉడికించాక తోటకూరను వేయాలి. అలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. తోటకూరలో నీరు పోయేంత వరకూ ఉడికించి అందులో కొబ్బరి తురుము వేస్తే సరి. ఘుమఘుమలాడే తోటకూర చికెన్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications