'6-7 డేటింగ్' అంటే ఏంటి? జెన్-జీ నయా ట్రెండ్!
ప్రస్తుత కాలంలో యువత కొత్త పోకడలను వెతుకుతోంది. మారుతున్న కాలంతో పాటు ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి వివిధ విషయాల్లో యువత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో చూపించే పర్ఫెక్ట్ జోడీల కోసం వెతికేవారు ఇప్పుడు వాస్తవంలో ప్రశాంతతను ఇచ్చే పార్ట్‌నర్ల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే '6-7 డేటింగ్' అనే సరికొత్త పదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏమిటీ '6-7 డేటింగ్'?
సాధారణంగా మనం ఎవరికైనా చూసినప్పుడు వారికి 10కి 10 మార్కులు ఇస్తుంటాం. అంటే అందం, హోదా, స్వభావం అన్నింటిలోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాం. కానీ '6-7 డేటింగ్' ట్రెండ్ ప్రకారం.. ఓ వ్యక్తి 10కి 10 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. 6 లేదా 7 పాయింట్లు ఉన్నా సరిపోతుంది. అంటే అద్భుతమై ఫాంటసీ ప్రేమ కథల కంటే.. మన భద్రతను, ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇచ్చే వ్యక్తి అయితే చాలని ఈ ట్రెండ్ చెబుతోంది.

పర్ఫెక్ట్ కంటే 6-7 ఎందుకు మంచిది?
మనం సినిమాల్లోనో, నవలల్లోనో చూసే అద్భుతమైన వ్యక్తులు నిజ జీవితంలో తారసపడటం చాలా అరుదు. ఒకవేళ అలాంటి 'పర్ఫెక్ట్' వ్యక్తి దొరికినా వారితో సర్దుకుపోవడం ఒక్కోసారి మానసికంగా అలసటను కలిగిస్తుంది. 6-7 స్కేల్‌లో ఉండే భాగస్వామి భావోద్వేగ పరంగా పరిణతి కలిగి ఉంటారు. వీరితో బంధం ప్రశాంతంగా, గొడవలు లేకుండా సాగుతుంది. పర్ఫెక్ట్‌గా నటించడం కంటే, తమలోని లోపాలతో సహా సహజంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు.
ఇది రాజీ పడటమేనా?
చాలామంది ఈ ట్రెండ్‌ను చూసి 'రాజీ పడటం' అని భావిస్తారు. కానీ జెన్-జీ యువత దీనిని మరో కోణంలో చూస్తోంది. అందం లేదా డబ్బు వంటి బాహ్య అంశాల్లో 10కి 10 వెతకడం కంటే, స్వభావం, భద్రతలో 6-7 ఉన్నా అది ఆరోగ్యకరమైన బంధానికి నాంది అని వారు నమ్ముతున్నారు. మనకు ఎన్నో సినిమాల్లో చూపించిన జంటలు 10కి 10 పాయింట్లు ఉండవు కానీ.. ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ బంధాన్ని ఐకానిక్‌గా మార్చుకున్నారు.
రెడ్ ఫ్లాగ్ కాదా?
కొందరు దీనిని ప్రతికూలంగా కూడా చూస్తారు. ఒక వ్యక్తిని ఇలా నంబర్లతో రేటింగ్ ఇవ్వడం సరికాదని.. కేవలం ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికే ఇలా 'తక్కువలో సర్దుకుపోతున్నారా?' అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. లేనిపోని అంచనాలతో ఒత్తిడికి గురవ్వడం కంటే.. మనకు సౌకర్యంగా ఉండే వ్యక్తిని ఎంచుకుని ప్రశాంతంగా ఉండటం. మొత్తం మీద '6-7 డేటింగ్' అనేది పర్ఫెక్ట్ పార్టనర్ కోసం వెతికి అలసిపోయిన వారికి ఒక గొప్ప ఊరట అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications