Mental Health Day: డాక్టర్లలో పెరుగుతున్న డిప్రెషన్.. రంగంలోకి అంతర్జాతీయ వైద్య సంస్థలు!
Mental Health Day: అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని(World Mental Health Day) పురస్కరించుకుని వైద్య వృత్తిలో ఉన్నవారి మానసిక ఆరోగ్యం, క్షేమంపై బహిరంగంగా చర్చించే వాతావరణాన్ని ప్రోత్సహించడానికి భారత్, బ్రిటన్ దేశాలకు చెందిన ఆరు ప్రముఖ మానసిక ఆరోగ్య, వైద్య సంస్థలు చేతులు కలిపాయి. 'హ్యుమనైజింగ్ మెడిసిన్ ఇండియా ఇనిషియేటివ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల అనుభవాలను కేంద్రంగా చేసుకుని వారి మానసిక ఆరోగ్య సమస్యలు, పనిప్రాంతాల్లో శ్రేయస్సుపై దృష్టి సారిస్తుంది.
ఆరు వైద్య సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం
ఈ సంకీర్ణంలో ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ టీచర్స్ ఆఫ్ సైకియాట్రీ, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్ జోన్ 15, యూకేకి చెందిన డెర్బీషైర్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, ఆశ కేరళ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వైద్యులలో పెరుగుతున్న ఒత్తిడి, బర్నౌట్, మానసిక ఆరోగ్య సమస్యల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టారు. సాధారణంగా రోగులకు సహాయం కోరాలని సూచించే వైద్యులు, తమ సొంత మానసిక ఒత్తిడిని ఒప్పుకోవడానికి వృత్తిపరమైన ఇమేజ్, సామాజిక అపవాదు కారణాల వల్ల వెనుకాడుతున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

భవిష్యత్ కార్యక్రమాలు, ప్రణాళికలు
ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ల అనుభవాలు, సహాయం పొందడంలో ఎదురవుతున్న అవరోధాలను అంచనా వేయడానికి ఓ జాతీయ సర్వే నిర్వహించనున్నారు. దీనితో పాటు వైద్యుల శ్రేయస్సుపై మూడు భాగాల జాతీయ వెబ్‌నార్ సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 2027లో మధురైలో జరిగే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వార్షిక సదస్సులో జాతీయ స్థాయి ప్రత్యక్ష వర్క్‌షాప్‌తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ చొరవలో భాగంగా వైద్యులు తమ సొంత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి 'కేర్ ఫర్ సెల్ఫ్ ప్లెడ్జ్', మానసిక ఆరోగ్య చర్చలకు సురక్షితమైన స్థలాన్ని అందించడానికి 'కల్చర్ ఆఫ్ కేర్ చార్టర్' ప్రతిపాదనలను రూపొందించనున్నారు.

రీసెర్చ్ ఆధారాలు, విశ్లేషణ
ఆరోగ్య రంగంలో ఉన్న తీవ్రతను వివరిస్తూ అధ్యయనాల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఇండియాలో జరిగిన అధ్యయనాల ప్రకారం దాదాపు సగం మంది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులలో డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. అలాగే ఒక టెర్షియరీ-కేర్ ఆస్పత్రిలోని రెసిడెంట్ డాక్టర్లు, ఫ్యాకల్టీపై జరిపిన అధ్యయనంలో 30.1శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నారని, 16.7శాతం మంది ఆత్మహత్య ఆలోచనలను నివేదించారని, 90 శాతం కంటే ఎక్కువ మంది బర్నౌట్‌ను ఎదుర్కొంటున్నారని తేలింది. సహాయం కోరడం అనేది ఓ మంచి వైద్యుడిగా ఉండటానికి అవరోధం కాదని, వృత్తిపరమైన సంస్కృతిలో మార్పు రావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిపుణులు పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
