వాస్తు ప్రకారం ఇంట్లో ఊయల ఉండొచ్చా? లేదా?
ఇంట్లో ఉయ్యాల ఊగడం అనేది కేవలం ఒక సరదా. మన సంస్కృతిలో, సాంప్రదాయంలో దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం ప్రతి ఇంట్లోనూ విశాలమైన నట్టింట్లోనో లేదా వరండాలోనో పెద్ద చెక్క ఉయ్యాలలు కనిపించేవి. నేటి ఆధునిక కాలంలోనూ చాలామంది తమ ఇళ్లలో స్థలం తక్కువగా ఉన్నా, బాల్కనీల్లోనో లేదా హాల్‌లోనే ఒక మూలనో ఉయ్యాలలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు ఒక నిర్దిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. ఉయ్యాల నిరంతరం కదులుతూ ఉండే వస్తువు కాబట్టి, అది ఇంట్లోని శక్తి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉయ్యాల ఏర్పాటు విషయంలో వాస్తు నియమాలు పాటించడం చాలా అవసరం.
ఇంట్లో ఊయల పెట్టడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఊయల ఏర్పాటు చేయడం అత్యంత శుభప్రదం. ఊయల ఊగుతున్నప్పుడు గాలిలో ఏర్పడే కదలికలు ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఇల్లంతా వ్యాపింపజేస్తాయి. ఉయ్యాల ఉన్న ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుందని, మనస్పర్థలు, అనవసర కలహాలు తగ్గుతాయని నమ్మకం. ఇది మానసిక ప్రశాంతతను, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ఏ రకమైన ఊయల శ్రేష్ఠమైనది?
ప్రస్తుతం మార్కెట్లో ఇనుము, స్టీల్, ప్లాస్టిక్, ఫైబర్ లేదా రోప్‌లతో చేసిన రకరకాల ఆధునిక ఊయలలు లభిస్తున్నాయి. కానీ వాస్తు ప్రకారం చెక్క ఊయల ఉత్తమం. వాస్తు శాస్త్రం ప్రకృతితో ముడిపడి ఉన్న వస్తువులకు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి టేకు లేదా మంచి నాణ్యమైన చెక్కతో చేసిన ఉయ్యాలలు
ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. చెక్క ఊయలపై కూర్చోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, చదువుపై శ్రద్ధ కుదురుతుందని నమ్మకం. ఇది పెద్దల్లో ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. ఇనుము లేదా స్టీల్ ఉయ్యాలల కంటే చెక్క వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ లోహపు ఉయ్యాల వాడితే, దానికి నల్లటి రంగులు కాకుండా లేత రంగులు ఉండేలా చూసుకోవాలి.
ఊయల దిశ, దిక్కుల నియమాలు
ఊయల ఏ దిశలో ఉందనే దానికంటే.. అది ఏ దిక్కు వైపు ఊగుతోంది, కూర్చున్నప్పుడు మనం ఏ దిక్కును చూస్తున్నాం అనేది వాస్తులో చాలా కీలకం. ఊయల ఊగే కదలిక ఎప్పుడూ తూర్పు నుంచి పడమర వైపు ఉండాలి. ఊయలపై కూర్చున్నప్పుడు మన ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఈ రెండు దిక్కులు దేవతలకు, కుబేరుడికి స్థానాలు కాబట్టి.. ఆ వైపు చూస్తూ ఊగడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.
ఊయలని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు. అలాగే దక్షిణం వైపు ముఖం పెట్టి ఊగడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉంది. ఇంటికి సరిగ్గా మధ్యలో బరువైన చెక్క ఉయ్యాలలను తగిలించకూడదు. ఎందుకంటే బ్రహ్మస్థానం ఎప్పుడూ ఖాళీగా, తేలికగా ఉండాలి.
ఊయల ఊగుతున్నప్పుడు కిర్రు కిర్రు అంటూ శబ్దం రాకూడదు. ఇలాంటి శబ్దాలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీని, వాస్తు దోషాలను పెంచుతాయి. ఊయల జాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు ఆయిల్ వేస్తూ ఎలాంటి శబ్దం రాకుండా చూసుకోవాలి. పెద్దలు చెబుతుంటారు.. ఊయలలో ఎవరూ లేనప్పుడు దాన్ని ఖాళీగా ఊపకూడదు అని. ఇది ఇంట్లో లేనిపోని సమస్యలను, మానసిక ఆందోళనలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. హాల్ , లేదా ఉత్తర/తూర్పు దిశల్లో ఉన్న బాల్కనీలు ఉయ్యాల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రదేశాలు. బెడ్‌రూమ్‌లలో ఉయ్యాలలు పెట్టకపోవడమే మంచిది.














Click it and Unblock the Notifications