మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రంలో మొదటిదైన మేష రాశికి, రెండవదైన వృషభ రాశికి చాలా భిన్నమైన స్వభావాలు ఉంటాయి. మేష రాశికి 'కుజుడు' , వృషభ రాశికి 'శుక్రుడు' అధిపతులుగా వ్యవహరిస్తారు. ఈ రెండు రాశుల వారు తమ జీవితంలో విజయం సాధించడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి చేయాల్సిన ప్రత్యేక పరిహారాలు, సూచనలు తెలుసుకుందాం.
మేష రాశి - కుజ గ్రహ అనుగ్రహం కోసం
మేష రాశి వారికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరిలో సహజంగానే శక్తి, వేగం, నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అయితే ఒక్కోసారి కోపం, తొందరపాటుతనం వల్ల నష్టపోతుంటారు. అదృష్టం కలిసిరావడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజూ వీలైతే "ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః" లేదా కనీసం "ఓం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం శ్రీరామరక్ష.

మంగళవారం నాడు ఎర్రటి కందిపప్పు, బెల్లం లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల కుజ దోషాలు తొలగి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా కోపాన్ని, తొందరపాటు నిర్ణయాలను అదుపులో ఉంచుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు లేదా వస్తువులను ఎక్కువగా వాడటం వీరికి కలిసివస్తుంది. దక్షిణ దిశ వీరికి అనుకూలం. మేష రాశి వారు తమ శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది.
వృషభ రాశి - శుక్ర గ్రహ అనుగ్రహం కోసం
వృషభ రాశికి లగ్జరీ, అందం, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు అధిపతి. ఈ రాశి వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు కానీ, ఒక్కోసారి బద్ధకం లేదా మొండితనం వల్ల అవకాశాలు కోల్పోతారు. వీరికి బాగా కలిసిరావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి లేదా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో నెయ్యితో దీపం వెలిగించి, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం పఠించడం అత్యంత విశేషం.శుక్రుడి అనుగ్రహం కోసం "ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః" లేదా "ఓం శుక్రాయ నమః" అనే మంత్రాన్ని నిత్యం స్మరించుకోవాలి.
శుక్రవారాల్లో పాలు, పెరుగు, పాయసం, తెల్లటి బట్టలు లేదా బియ్యాన్ని పేద మహిళలకు దానం చేయడం వల్ల శుక్ర బలం పెరిగి లగ్జరీ లైఫ్ లభిస్తుంది. శుక్రుడికి ఇల్లూ, ఒళ్లూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇష్టం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉండాలి. స్త్రీలను గౌరవించడం వల్ల వృషభ రాశి వారికి అఖండ అదృష్టం లభిస్తుంది. తెలుపు, లేత గులాబీ, వెండి రంగులు వీరికి బాగా కలిసివస్తాయి. ఆగ్నేయ దిశ అనుకూలం. వృషభ రాశి వారు తమ మొండితనాన్ని పక్కన పెట్టి ఇతరుల సలహాలను గౌరవిస్తే కెరీర్‌లో అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications