• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"మార్గశిర మాసం" -ముక్తికి మార్గం..ఏం చేస్తే లభిస్తుంది..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశిరమాసం అని అంటారు. "మార్గశిర మాసం" -ముక్తికి మార్గం. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం" మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి.

మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో "ఓం నమో నారాయణయ'" అనే మంత్రాన్ని స్మరించాలి.

How to attain salvation in Margasira masam

ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు. మార్గశిర శుద్ధ షష్ఠి - 'స్కంద షష్ఠి'. శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి... "గీతాజయంతి". సమస్త మానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి లేక సఫలైకాదశి అనికూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ "దత్తాత్రేయ జయంతి" ని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు "హనుమద్ వ్రతం", "మత్స్యద్వాదశి", "ప్రదోష వ్రతం" ఆచరించడం పరిపాటి.

ఈ మాసంలోనే "అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ ( మల్ల ) ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం, శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సురాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.

English summary
Margasira masam is the way to salvation according to hindu mythology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X