ఎల్ నినోపై తెలంగాణ ముందస్తు సన్నాహాలు
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎల్ నినో పరిస్థితులు, దీని ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, హోం, ఆరోగ్య, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, అంతర్రాష్ట్ర జల పంపిణీలో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా దక్కేలా చూడాలని ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి, అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ నీటిని జలవిద్యుత్ ఉత్పత్తికే వంద శాతం వాడుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కోయినా నీరంతా తెలంగాణ వినియోగించుకుని, మహారాష్ట్రకు అవసరమైన విద్యుత్‌ను మనం సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును ఆదేశించారు.
ప్రతి ఏటా గోదావరి నది నుంచి వేల టీఎంసీల జలాలు బంగాళాఖాతంలోకి వృథాగా పోతున్నాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వచ్చే వరద నీటిని ఎలా మళ్లించాలి అనే దానిపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అన్నారు. డ్యామ్‌ల నిర్వహణ వివరాలపై అధికారులను ఆరా తీశారు.
గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, నిర్వహణకు ఇప్పటికే రూ. 300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు. ఈ వర్షాకాలంలో ఏదైనా డ్యామ్ విషయంలో ఇబ్బందులు తలెత్తినా, నిర్వహణ లోపం ఉన్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాతావరణ శాఖ నివేదికలు, అంచనాలకు అనుగుణంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.
పంటల మార్పిడి, వైవిధ్యత, తక్కువ నీటిని వినియోగించుకునే పంటల రకాల సాగుపై రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాను పూర్తిగా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులకు ముఖ్యమంత్రి ప్రశ్నలు సంధించారు.
వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, వంతెనల నిర్మాణం, ఇతర పనుల కోసం విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1,000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రాంతాల్లో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని గతంలో నిర్ణయించిన వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications