చనిపోయిన నేతకు పదవి..! పవన్ టీమ్ 'బ్లండర్ మిస్టేక్'
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు" తప్పులు దొర్లాయి. పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తామని అధినేత ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయి పరిశీలన, సమన్వయ లోపం కారణంగా పార్టీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ఏకంగా నెల రోజుల క్రితమే మరణించిన ఒక సీనియర్ నాయకుడికి నూతన కమిటీలో పదవి కేటాయించడం జనసేన సోషల్ మీడియా వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మే 22న నివాళి.. జూన్‌లో పదవి!
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఈ భారీ తప్పు చోటుచేసుకుంది. తాడిపత్రి రూరల్ మండలానికి చెందిన జనసేన కీలక నాయకుడు కుంకుమ కిరణ్ కుమార్ గత నెలలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మే 22వ తేదీన జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించడమే కాకుండా, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

అయితే, తాజాగా విడుదల చేసిన "అనంతపురం పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" (Parliament Observers Team) జాబితాలో అదే కుంకుమ కిరణ్ కుమార్ (తాడిపత్రి) పేరును, ఫోటోను సభ్యుడిగా చేర్చడం గమనార్హం.
ఐదుగురు సహాయక సిబ్బంది ఉన్నా ఈ నిర్లక్ష్యమేంటి?
పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సాగే ఈ కమిటీలకు సహాయం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు ప్రత్యేక సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు. అయినప్పటికీ, ఒక నియోజకవర్గంలో పార్టీ కోసం తొలి నుంచి పనిచేసి, మరణించిన ముఖ్య నేత సమాచారాన్ని కూడా అప్‌డేట్ చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికారిక పేజీలోనే సంతాపం తెలిపిన వ్యక్తి పేరును, మళ్లీ నెల రోజుల తర్వాత కమిటీ లిస్ట్‌లో ఎలా పెడతారని సొంత పార్టీ కార్యకర్తలే సామాజిక మాధ్యమాల్లో (Janasena Party Updates పేజీలలో) ప్రశ్నిస్తున్నారు. "దయచేసి ఈ తప్పును సరిచేయండి అయ్యా" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
క్షేత్రస్థాయి సమాచార సేకరణలో లోపాలు!
పార్లమెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అసలైన 'సాధక్స్'ను గుర్తించడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశమని జనసేనాని చెప్తున్నప్పటికీ, కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఈ జాబితా చూస్తే క్షేత్రస్థాయి సమాచారాన్ని ఏ మేరకు సరిచూసుకున్నారనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రక్రియలో ఇలాంటి సాంకేతిక, సమన్వయ లోపాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తప్పిదంపై జనసేన అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో, కమిటీల జాబితాను ఏ విధంగా సవరిస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications