eKYC నరకం: సామాన్యులే కాదు.. మాజీ సీఈసీ కూడా తిప్పలే!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌పీజీ గ్యాస్ 'ఈ-కేవైసీ' ప్రక్రియ సామాన్యులకే కాదు, దేశంలో అత్యున్నత పదవులు నిర్వహించిన ప్రముఖులకు కూడా తీవ్ర నరకం చూపిస్తోంది. నెల రోజులుగా యాప్‌లలో ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా తరచూ ఎర్రర్లు వస్తున్నాయని, హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్లు పనిచేయడం లేదని భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై. ఖురేషీ ఆవేదన వ్యక్తం చేశారు. వయోభారం వల్ల గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు స్వయంగా వెళ్లలేని వృద్ధుల పరిస్థితి ఏంటని ఆయన ఇండియన్ ఆయిల్ ను సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.

యాప్ ఫెయిల్.. టోల్ ఫ్రీ పనిచేయదు!
కేవైసీ చేయకపోతే గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామనే హెచ్చరికలు ఒకవైపు వస్తుంటే, మరోవైపు డిజిటల్ వ్యవస్థలు ఏమాత్రం సహకరించకపోవడంపై ఖురేషీ ధ్వజమెత్తారు. "గత నెల రోజులుగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రతిసారీ యాప్‌లో ఎర్రర్ వస్తూ ప్రక్రియ ఫెయిల్ అవుతోంది. పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే అది ఎప్పుడూ 'అవుట్ ఆఫ్ ఆర్డర్' అని వస్తోంది. ఇక నాలాంటి వయోవృద్ధులు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి గంటల తరబడి లైన్లలో నిలబడటం అసాధ్యం. అటు చూస్తే కనెక్షన్ కట్ చేస్తామనే బెదిరింపులు.. దీనికి పరిష్కారం ఏంటో కాస్త చెప్పండి" అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
For one month I have been trying to update my ekyc but app fails every time. Toll free call is always out of order. Phy visit is not possible for old people. Keep getting threat of elimination. Please advise. @indane_gas @indanegasonline
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) August 16, 2026
వయోవృద్ధులకు తీవ్ర ఇబ్బందులు!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సబ్సిడీ కొనసాగాలన్నా, సిలిండర్ సరఫరా ఆగకుండా ఉండాలన్నా ఈ-కేవైసీ తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో సజావుగా సాగకపోవడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, ఫేస్ ఆథెంటికేషన్ వంటివి యాప్‌లలో పనిచేయకపోవడం, టెక్నికల్ గ్లిచ్‌లు రావడం పెద్ద సమస్యగా మారింది. మాజీ సీఈసీ ఖురేషీ చేసిన ట్వీట్‌తో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక అత్యున్నత స్థాయి మాజీ అధికారికి ఈ పరిస్థితి ఉంటే.. ఇక గ్రామాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
సమస్య తీరేదెప్పుడు?
ఖురేషీ ట్వీట్‌పై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిస్పందించాల్సి ఉంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగకుండా, ఇంటి వద్దకే వచ్చి వృద్ధులకు డెలివరీ బాయ్స్ ద్వారానే కేవైసీ పూర్తి చేసేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల సీనియర్ సిటిజన్లు ఇబ్బంది పడకుండా గ్యాస్ కంపెనీలు తక్షణమే స్పందించి సర్వర్ల సమస్యను, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు.














Click it and Unblock the Notifications