నేడు కార్తీకమాసం మొదటి సోమవారం: చేయాల్సినవి
హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఆచరించే జప తపాలు, పూజలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని భక్తుల దృఢ విశ్వాసం. శివకేశువుల దివ్యానుగ్రహం కోసం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుందీ నెలలో. కార్తీక మాసంలో దినచర్య తెల్లవారు జామున సూర్యోదయానికి ముందే ప్రారంభమవుతుంది.
ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక స్నానం ఆచరించాలి. నదీ, సముద్ర స్నానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అవి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే గంగాజలం, తులసి ఆకులు కలిపిన నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. స్నానానంతరం సాంప్రదాయ వస్త్రాలు ధరించి, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజాదికాలు ప్రారంభించడానికి ముందు సంకల్పం చెప్పుకోవాలి. పేరు, గోత్రం స్మరిస్తూ కుటుంబ శ్రేయస్సు, ప్రశాంతత కోసం పూజ చేస్తున్నట్లు మనసులో ధ్యానించాలి. అనంతరం దీపాన్ని వెలిగించాలి.

ఆవు నెయ్యి గానీ, నువ్వుల నూనెతో గానీ రెండు ప్రమిదల్లో దీపాలు వెలిగించి, వాటిని పీఠంపై ఉంచి పువ్వులతో అలంకరించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ శ్లోకాన్ని పఠిస్తూ దీప కాంతికి నమస్కరించుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజ తర్వాత శివకేశవులను ఆరాధించాలి. శివలింగానికి లేదా ఈశ్వరుడి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం నీటితో అభిషేకించి, విభూతి ధారణ చేయాలి. పరమశివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు, సుగంధ పుష్పాలను సమర్పిస్తూ ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
అదే విధంగా శ్రీమహావిష్ణువు లేదా సాలగ్రామానికి తులసి దళాలతో అష్టోత్తర అర్చన చేసి, ఓం నమో నారాయణాయ నామాన్ని స్మరించాలి. స్వామివార్లకు పండ్లు, పాయసం నైవేద్యంగా నివేదించాలి. కార్తీక మాసంలో సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ ప్రదోష వేళలో తులసి కోట వద్ద, ఇంటి ముఖద్వారం వద్ద, దేవాలయాల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల అనేక దోషాలు హరించుకుపోతాయి.
ఈ మాసంలో సాయంత్రం వేళల్లో కార్తీక పురాణ గ్రంథాన్ని పఠించడం లేదా శ్రద్ధగా వినడం వల్ల ఆత్మజ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజులలో రోజంతా నిరాహారంగా ఉండి, సాయంత్రం శివదర్శనం అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర మాసంలో జప హోమాలతో పాటు దానధర్మాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది.
పేదలు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయడం వల్ల పూర్వ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. నిష్టతో, భక్తిశ్రద్ధలతో కార్తీక మాస నియమాలను పాటిస్తూ హరిహరులను ఆరాధించడం వల్ల మానసిక శాంతి, సమస్త శుభాలు ప్రాప్తిస్తాయి.













Click it and Unblock the Notifications
