దేవుడు ఎక్కడ ఉంటాడు? రాజు అడిగిన 3 ప్రశ్నలకు బాలుడి అద్భుత సమాధానాలు..!!
Moral Story:సింహపురి అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడు జీవనం సాగించేవాడు.తన బతుకుదెరువు కోసం ఆ ఇంటా ఈ ఇంటా పూజలు, ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ప్రత్యేక పూజలు చేయాల్సిందిగా ఆహ్వానించారు ఆ దేశాన్ని పరిపాలించే రాజు. ఇక పూజ చేసేందుకు ఆ రాజభవనానికి చేరుకున్నాడు. రాజు కోరిక మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించాడు ఆ బ్రాహ్మణుడు. పూజలన్నీ అయ్యాక ఇక ఇంటికి వెళుతున్న సమయంలో రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద ఓ సందేహాన్ని ప్రస్తావించాడు.
రాజు అడిగిన మూడు ప్రశ్నలు
"అయ్యా.. ప్రతి రోజు నువ్వు దేవుడికి పూజలు ప్రార్థనలు చేస్తావు కదా.. అయితే ఇప్పుడు ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, చూడటానికి ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు" అని ఆ రాజు బ్రాహ్మణుడిని అడిగాడు. రాజు ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు.తనకు ఒక నెల సమయం ఇస్తే అన్ని ప్రశ్నలకు సమాధానంతో తిరిగి వస్తానని ఆ బ్రాహ్మణుడు రాజుకు విన్నవించుకున్నాడు.ఇందుకు రాజు అంగీకరించి ఒక నెలలోగ తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పి ఆ బ్రాహ్మణుడిని అక్కడి నుంచి పంపించి వేశాడు.

ఇక రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డాడు బ్రాహ్మణుడు.రోజులు గడుస్తున్నాయి. సమాధానం మాత్రం దొరకడం లేదు. రాజు ఇచ్చిన గడువు దగ్గరపడుతోంది. బ్రాహ్మణుడకి మాత్రం రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. దీంతో నిరుత్సాహానికి గురయ్యాడు బ్రాహ్మణుడు.ఏం చేయాలో తెలియడం లేదు. బ్రాహ్మణుడు ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నాడో అర్థంకానీ తన కొడుకు, ఎందుకు అలా ఉన్నావని తండ్రిని అడిగాడు. ఇందుకు రాజు అడిగిన ప్రశ్నలకు తన వద్ద సమాధానం దొరకడం లేదని ధీనంగా చెప్పాడు బ్రాహ్మణుడు. "ఇంతేనా.. దీని గురించి కలత చెందొద్దు, బాధపడొద్దు. రాజు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను నన్ను అక్కడికి తీసుకెళ్లు" అని కొడుకు చెప్పగానే ఆ బ్రాహ్మణుడు కాస్త కుదుటపడ్డాడు.
పాలల్లో వెన్న కనిపిస్తుందా..
రాజు ఇచ్చిన గడువు ముగియడంతో ఆ బ్రాహ్మణుడు తన కొడుకుని రాజభవనంకు తీసుకెళ్లాడు. "మహారాజ దేవుడి పై మీరు అడిగిన మూడు ప్రశ్నలకు నా కొడుకు సమాధానం ఇస్తాడు" అంటూ బ్రాహ్మణుడు చెప్పుకొచ్చాడు. బ్రాహ్మణుడి కొడుకును రాజు ఆ మూడు ప్రశ్నలు అడిగాడు. సమాధానం చెప్పే ముందు ఆ కొడుకు రాజుతో ఇలా అన్నాడు - "మహారాజా సమాధానం చెప్పడానికి ముందు అతిథిగా మీ ముందు నిలబడ్డ కనీస మర్యాదలు చేయడం ధర్మం కదా" అని అడిగాడు. తన పొరపాటును గ్రహించిన రాజు..బ్రాహ్మణుడి కొడుకుకు మర్యాదలు చేయాల్సిందిగా అక్కడే ఉన్న పనివారిని పురమాయించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం కుర్రాడికి గ్లాసు పాలు ఇచ్చారు. ఆ పాలను తన వేలుతో కలిపి దాని వంక తదేకంగా చూడటం ప్రారంభించాడు ఆ కుర్రాడు. ఇది గమనించిన రాజు ఏం చేస్తున్నావ్ అని కుర్రాడిని అడిగాడు. "పాలల్లో వెన్న ఉంటుందని విన్నాను రాజా.. ఆ వెన్న ఈ పాలల్లో కనిపించడం లేదని చూస్తున్నా" అని ఆ కుర్రాడు రాజుకు సమాధానం ఇచ్చాడు.
అందుకు రాజు చిరునవ్వుతో... పాలల్లో వెన్న ఉంది అయితే ముందుగా పాలను వేడి చేసి కొంత పెరుగు తోడుగా వేస్తే ఆ పాలు పెరుగుగా మారుతుందని ఆ తర్వాత పెరుగును చిలికితే వెన్న బయటపడుతుందని చెప్పాడు. రాజు ఇచ్చిన సమాధానంకు బదులిస్తూ ఆ కుర్రాడు ఇలా అన్నాడు."మహా ప్రభు మీరు అడిగిన మూడు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం లభించింది.పాలల్లో వెన్న ఉన్నట్లే.. భగవంతుడు ప్రతి మనిషిలోను నివసిస్తాడు.అయితే ఆ దేవుడిని కనుగొనేందుకు మనిషి తన మనసుతో ఆత్మతో ధ్యానించడం ముఖ్యం. అప్పుడే కనిపించని దేవుడు తన కళ్లముందు దర్శనమిస్తాడు" అని సమాధానం ఇచ్చాడు. కుర్రాడు చెప్పిన సమాధానంతో రాజు సంతృప్తి చెందాడు.కుర్రాడి తెలివితేటలను మెచ్చుకున్నాడు.
కొవ్వొత్తి వెలుగు ఏ దిక్కున వెలుగుతోంది..?
ఇక రెండవ ప్రశ్నగా దేవుడి ప్రతిరూపం ఏ దిక్కున కనిపిస్తుందని అడిగాడు.ఇందుకు ఆ కుర్రాడు ఒక కొవ్వొత్తిని తీసుకుని దాన్ని వెలిగించి.. ఇక్కడ నుంచి వచ్చే వెలుగు ఏ దిక్కున ప్రకాశిస్తోందని ప్రశ్నించాడు. ఈ వెలుగు అన్ని చోట్ల విస్తరించిందని సమాధానం చెప్పాడు. ఇందుకు కుర్రాడు చిక్కటి నవ్వు నవ్వి భగవంతుడు కూడా అన్ని దిక్కుల్లో కనిపిస్తాడని.. అందరినీ సమానంగా చూస్తాడని అయితే మనిషి చేసే ఆయా క్రియలను బట్టి భగవంతుడు ఆశీర్వాదాలుంటాయని సమాధానం చెప్పాడు. కుర్రాడి జవాబుకు ఫిదా అయిన రాజు.. తన చివరి ప్రశ్నగా భగవంతుడు ఏం చేయగలడని ప్రశ్నించాడు.
భగవంతుడు తలచుకుంటే..
ఆ ప్రశ్నకు సమాధానం రావాలంటే మహారాజును స్థాన చలనం కోసం ప్రార్థించాడు కుర్రాడు.అంటే రాజ సింహాసనంపై తాను కూర్చొంటానని, రాజును కింద నిల్చోవాలని వినయంతో అడిగాడు. ఇందుకు రాజు సరేననడంతో...కుర్రాడు సింహాసనం పై కూర్చుండగా... రాజు సామాన్య వ్యక్తిలా కింద నిల్చనున్నాడు. దీంతో మీ మూడవ ప్రశ్నకు సమాధానం దొరికింది రాజా అంటూ ఆ కుర్రాడు చెప్పాడు."మహా ప్రభు భగవంతుడు తలచుకుంటే ఒక పేదవాడిని సింహాసనం ఎక్కిస్తాడు... అదే సమయంలో ఒక రాజును సామాన్య స్థితికి తీసుకురాగలడు. దేవుడికి ఆ శక్తి ఉంది" అంటూ కుర్రాడు ముగించాడు. కుర్రాడు ప్రదర్శించిన తెలివితేటలకు రాజు ముగ్ధుడయ్యాడు. ఆ కుర్రాడిని తన ఆస్థాన సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాడు.
కథలో నీతి
భగవంతుడు ప్రతి ఒక్కరిలోను నివసిస్తాడు.. అందరినీ సమానంగా చూస్తాడు. తన శక్తికి అంతు లేదు.ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఇట్టే మార్చేయగలడు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు భగవంతుడని ఆత్మతో,పూర్ణహృదయంతో ధ్యానిస్తూ సాటి మనిషి పట్ల మానవత్వం కలిగి ఉంటే భగవంతుడు అక్కడ ఉన్నట్టే అని ఈ కథ బోధిస్తోంది.














Click it and Unblock the Notifications
