దీపావళి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ పని చేయొద్దు..!
భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో భిన్న భాషలు, భిన్న ఆచారాలు ఉన్నప్పటికీ దీపావళి పండుగ మాత్రం అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చే పండుగగా నిలుస్తుంది. చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే ఈ పండుగను దేశమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అక్టోబర్ 20న ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోనుంది. ఆరోజు లక్ష్మీదేవిని పూజించి సంపద, శ్రేయస్సు, ఆనందం కలిగించమని కోరుకుంటారు. పిల్లలు టపాసులు కాల్చి ఆనందిస్తారు, పెద్దలు బంధుమిత్రులను కలుసుకుని స్వీట్లు పంచుకుంటారు. ఇప్పటికే ఊరూరా, పట్టణాల్లో టపాసుల మోతలు మొదలై పండుగ వాతావరణం నెలకొంది.
కాగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను రాముడి అయోధ్య తిరుగుముఖం సందర్భంగా.. దక్షిణ భారతదేశంలో కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా వేడుకలు నిర్వహిస్తారు. అలానే పశ్చిమ భారతదేశంలో లక్ష్మీ పూజ, వ్యాపార సంవత్సరారంభంగా జరుపుకుంటారు.

దీపావళి రోజున చేయాల్సిన పనులు..
కాగా దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి, చీకటి లేకుండా దీపాలతో వెలిగించాలి. దీపాల కాంతి అధర్మం, అజ్ఞానం, దారిద్ర్యం తొలగించడాన్ని సూచిస్తుంది. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. పండుగ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. పాలు, పాయసం, ఫలాలు వంటి పదార్థాలతో దేవిని పూజించాలి. అంతే కాకుండా పూజ సమయంలో ప్రశాంతంగా, సంతోషంగా, భక్తితో ఉండాలి. అలాగే ఆరోజున దానం చేయడం, పేదవారికి సహాయం చేయడం కూడా అత్యంత పుణ్యకార్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
దీపావళి రోజున చేయకూడని పనులు..
- దీపావళి రోజున కొన్ని పనులు చేయడం అపశకునంగా భావిస్తారు. అవేంటంటే..
- ముఖ్యంగా ఇంట్లో చీకటి ఉండకూడదు. చీకటి ఉంటే ఇంట్లో సౌభాగ్యం తగ్గుతుందని విశ్వసిస్తారు.
- నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. గులాబీ, పసుపు, ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులు ధరించడం శుభప్రదం.
- ఆరోజున డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. అది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు.
- పండుగ రోజు ఇంటిని ఊడ్చడం, బూజు దులపడం చేయరాదు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంటినుంచి వెళ్లిపోతారని విశ్వాసం ఉంది. ఈ పనులను పండుగకు ముందు రోజే పూర్తిచేయడం మంచిది.
- దీపావళి రోజున మాంసాహారం తినకూడదు, ఇది దేవతలకు అసంతృప్తి కలిగిస్తుంది.
- అలాగే తులసి ఆకులు తీయడం, తాకడం కూడా మానుకోవాలి. ఈ రోజున తులసి దేవి విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు.
టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు..
ఇక దీపావళి అంటే టపాసులు, కానీ వాటిని కాల్చేటప్పుడు భద్రతా నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో ఉండాలి. కాటన్ దుస్తులు ధరించడం సురక్షితం. నీరు లేదా ఇసుక బకెట్ దగ్గర ఉంచుకోవాలి. టపాసులు కాలుస్తున్నప్పుడు చెత్త దగ్గర లేదా పెట్రోల్ వంటి పదార్థాల వద్ద ఉండకుండా చూసుకోవాలి.












Click it and Unblock the Notifications