vastu tips: ఈ చెట్లు ఇళ్ళలో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్ధిక ఇబ్బందులు
ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు అవసరమో అదేవిధంగా ఇంట్లో మొక్కలను పెంచడానికి కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు నియమాల ప్రకారం మొక్కలను పెంచితే, మొక్కలు ఎంపిక చేసుకుంటే అవి ఇంట్లో సానుకూల ఫలితాలకు కారణంగా మారుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లలో పాలు కారే మొక్కలు, బోన్సాయ్ మొక్కలు, కాక్టస్, పత్తి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇక ఇవే కాకుండా మరి కొన్ని వాస్తుకు అనుకూలంగా లేని మొక్కలు, చెట్లు పెంచడం వల్ల కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక ఆ మొక్కల గురించి తెలుసుకుందాం.

తుమ్మ చెట్టు
ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఇంటి సమీపంలో ఎక్కడా తుమ్మ చెట్లు లేకుండా చూసుకోవాలి. ఇళ్లవద్ద తుమ్మ చెట్లు ఉండటం ఏ మాత్రం మంచిది కాదు. తుమ్మ చెట్ల వల్ల తరచూ భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు చోటుచేసుకుంటాయి. అనవసరమైన కారణాలకు కూడా నిరంతరం వాగ్వివాదాలకు దిగుతూ ఉంటారు. కాబట్టి ఇళ్ల దగ్గర తుమ్మ చెట్లు లేకుండా చూసుకోవాలి.

చింత చెట్టు
ఇంటికి సమీపంలో ఉండకూడని మరొక చెట్టు చింత చెట్టు. చింత చెట్లను అశుభ సూచకంగా భావిస్తారు. అవి దుష్ట శక్తులకు నిలయంగా కూడా పనిచేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చింత చెట్టు పక్కనే ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం కూడా చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తరచుగా హెచ్చరిస్తున్నారు. చింత చెట్టు ఇంట్లో ఉంటే, ఇంటి సమీపంలో ఉంటే ఎప్పుడూ ఆ కుటుంబం లో చింతలే ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గోరింటాకు మొక్క
గోరింటాకు మొక్కను కూడా అద్భుతమైన మొక్క గా పరిగణిస్తారు. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్తులు ప్రశాంతంగా జీవించ లేరని సమాచారం.

వెదురు మొక్క
ఇక వెదురు మొక్కలు కూడా ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని తెలుస్తుంది. లక్కీ వెదురు మొక్క అదృష్టాన్ని ఇస్తే, అన్య దేశ వెదురు మొక్క అనారోగ్యాలకు కారణమవుతుంది. చాలామంది వెదురు మొక్కలను ఇళ్లను సురక్షితంగా ఉంచడానికి కాంపౌండ్ వాల్ చుట్టూ పెంచుతూ ఉంటారు. ఇంటి చుట్టూ వెదురు మొక్కలు ఉండడంవల్ల కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. ఇక మరణ సమయంలో హిందూమతంలో వెదురు ఉపయోగిస్తారు కాబట్టి వాస్తు శాస్త్రం వెదురును అనారోగ్యంతోనూ, మరణంతోనూ ముడి పెట్టింది.

రావి చెట్టు
ఇక ఇళ్ల దగ్గర ఉండకూడని మరొక చెట్టు రావి చెట్టు. రావి చెట్లు దేవాలయాలలో ఎక్కువగా కనిపించినప్పటికీ వీటిని ఇళ్లల్లో పెంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. రావిచెట్టును పెంచాలి అనుకుంటే దానిని పవిత్రమైన స్థలంలో గాని, దేవాలయంలో గానీ నాటాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా రావిచెట్టును ఇళ్లల్లో పెట్టుకుంటే అవి ఆర్థిక సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు.

ఖర్జూర చెట్టు
ఖర్జూర చెట్టు ను కూడా ఇళ్లలో పెంచుకునే చెట్టుగా చూడరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఖర్జూర చెట్టు తరచుగా ఆర్థిక ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఈ చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఈ చెట్టు ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతుంది. ఈ చెట్టు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఎండిపోయిన మరియు కుళ్ళిపోతున్న మొక్కలు
ఏ రకమైన ఎండిపోయిన లేదా కుళ్ళిన మొక్క అయినా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఇంట్లో ఉంచే మొక్కలు తప్పనిసరిగా పచ్చగా మరియు తాజాగా, పువ్వులు మరియు పండ్లను కలిగి ఉండాలి. మీ ఇంట్లో మొక్కలు ఉంటే, వాటిని అందంగా పెరగడానికి తగినంత నీరు మరియు సూర్యరశ్మిని అందించండి. చనిపోయిన మరియు కుళ్ళిన మొక్కలను వెంటనే తొలగించాలి. ఎండిపోయిన పువ్వులు కూడా అశుభమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి వాటిని కూడా వెంటనే పారేయాలి. ఇక ఇంట్లో మొక్కలు పెంచాలని భావించేవారు ఈ నియమాలను పాటిస్తే, ఈ మొక్కలకు, చెట్లకు దూరంగా ఉంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications