vastu tips: మనీప్లాంట్ దొంగతనంతో అదృష్టం కలుగుతుందా?
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మెజారిటీ ప్రజల నమ్మకం. అయితే, ఈ మొక్క గురించి సమాజంలో ఒక వింత ప్రచారం విపరీతంగా సాగుతోంది. ఎవరి ఇంట్లోనైనా మనీ ప్లాంట్ బాగా పచ్చగా ఎదుగుతుంటే.. వారి అనుమతి లేకుండా, రహస్యంగా దానిని దొంగిలించి తెచ్చి మన ఇంట్లో నాటితే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. మరి ఈ 'దొంగతనం' సిద్ధాంతంలో ఎంతవరకు నిజముంది? వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? అనేది తెలుసుకుందాం.
దొంగతనంతో అదృష్టమా? వాస్తు ఏమంటోంది?
వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. సంపద, లక్ష్మీదేవి అనుగ్రహం అనేవి ఎప్పుడూ నైతిక విలువలు, సానుకూల శక్తి ఉన్న చోటే ఉంటాయి. ఇతరుల అనుమతి లేకుండా, వారిని మోసం చేసి లేదా దొంగిలించి తెచ్చే ఏ వస్తువైనా ఇంట్లోకి ప్రతికూల శక్తిని మోసుకొస్తుంది. దొంగతనంగా తెచ్చిన మనీ ప్లాంట్ వల్ల లాభం రాకపోగా.. ఇంట్లో మనఃశాంతి కరువై, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, నైతికంగా కొనుగోలు చేసిన లేదా ఎవరైనా సంతోషంగా బహుమతిగా ఇచ్చిన మొక్కను నాటడమే శ్రేయస్కరం.

మనీ ప్లాంట్ - శుక్రుడు
జ్యోతిష్య శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు, సంపద-విలాసాలకు అధిపతి అయిన శుక్ర గ్రహానికి లంకె ఉంది. ఇంట్లో ఈ మొక్క ఎంత పచ్చగా, దట్టంగా పెరిగితే.. ఆ ఇంట్లో అంత ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతాయని నమ్మకం. కేవలం మొక్కను తెచ్చి నాటడమే కాదు.. దానికి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ముఖ్యం: మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంట్లో ఆగ్నేయ దిశలోమాత్రమే ఉంచాలి. ఈ దిశ వినాయకుడికి, శుక్రుడికి ప్రీతికరమైనది కావడం వల్ల సానుకూల శక్తి, ధనలాభం కలుగుతాయి. పొరపాటున కూడా మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో పెట్టకూడదు. ఇది ఇంట్లోని శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది.
మంచి రోజులు
ఈ మొక్కను నాటడానికి బుధవారం, శుక్రవారం అత్యంత ప్రశస్తమైన రోజులు. మనీ ప్లాంట్ తీగలు కింద నేలపై పాకకూడదు, వాటిని పైకి పాకించాలి. అలాగే ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ మొక్కను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనీ ప్లాంట్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. ఇంట్లో ఉండే సానుకూల వాతావరణం, మన నైతిక ప్రవర్తన, కష్టపడి చేసే పనులే మనిషిని నిజమైన కోటీశ్వరుడిని చేస్తాయి కానీ దొంగతనం కాదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications