vastu tips: పక్కింటి వాస్తు మనపై ప్రభావం చూపుతుందా?
ఈ రోజుల్లో చాలామంది సొంత ఇల్లు అనగానే అపార్ట్‌మెంట్‌ల కంటే ఇండిపెండెంట్ హౌస్‌లకే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే, అక్కడ గదులు విశాలంగా ఉంటాయి, అపార్ట్‌మెంట్‌ల లాంటి ఆంక్షలు, పరిమితులు ఉండవు, పైగా మన అభిరుచులకు, అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని సొంతంగా ముస్తాబు చేసుకోవచ్చు. అందుకే స్థలం కొని ఇల్లు కట్టుకోవడమో, లేదా నచ్చిన ఇండిపెండెంట్ గృహాన్ని కొనుగోలు చేయడమో చేస్తుంటారు.
అయితే, మన ఇల్లు నూటికి నూరు పాళ్ళు వాస్తు ప్రకారమే చక్కగా ఉన్నా... మన చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాస్తు సరిగా లేకపోతే ఆ ప్రభావం మనపై పడుతుందా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. మన పక్కన ఉన్న ఇల్లు వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉంటే, ఆ లోపాలు మనల్ని ఇబ్బంది పెడతాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి పరిశీలిద్దాం.

కొత్త ఇల్లు కట్టినప్పుడు
సాధారణంగా పక్కింటి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టినప్పుడో లేదా వారు తమ ఇంటి ఆవరణలో వాటర్ సంప్ , సెప్టిక్ ట్యాంక్ వంటివి తవ్వినప్పుడో ఇరుగుపొరుగు వారిలో ఇలాంటి భయాలు మొదలవుతాయి. ఉదాహరణకు, ఒకరి ఇంటి దక్షిణ భాగంలో ఉన్న పక్కింటి వాళ్ళు తవ్విన వాటర్ సంప్.. మరొకరి ఇంటికి సరిగ్గా ఆగ్నేయ మూలలోకి రావచ్చు. ఇలాంటి మార్పులు జరిగినప్పటి నుంచే తమ కుటుంబంలో వరుస సమస్యలు, ఇబ్బందులు మొదలయ్యాయని, పక్కింటి వాస్తు దోషం వల్లే తమకు ఇలా జరుగుతోందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
కానీ, వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఇది చాలామందిలో ఉండే ఒక పెద్ద అపోహ మాత్రమే. పక్కింటికి వాస్తు బాలేకపోతే ఆ ప్రభావం మీ ఇంటిపై అస్సలు పడదు. ఎవరి ఇంటి వాస్తు ఫలితాలు ఆ ఇంట్లో నివసించే వారికే వర్తిస్తాయి. కాబట్టి పక్కింటి సంప్ లేదా మరేదైనా లోపం వల్ల మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయన్న మాటలో ఎలాంటి నిజం లేదు.
ప్రహరీ గోడ అనేది చాలా ముఖ్యం
అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాలి. రెండు ఇళ్ళ మధ్య సరైన కాంపౌండ్ వాల్ ఉందా లేదా అనేది ఇక్కడ అత్యంత కీలకం. వాస్తు శాస్త్రం ప్రకారం.. పక్కన ఎలాంటి దోషపూరిత నిర్మాణాలు ఉన్నా, మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటే ఆ పక్కన ఉన్న నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి అస్సలు ప్రవేశించలేదు. ఒకవేళ రెండు ఇళ్ళ మధ్య సరైన సరిహద్దు గోడ లేకపోతే మాత్రం ఆ నెగిటివ్ ప్రభావం ఖచ్చితంగా మీపై ఉంటుంది.
అందుకే దీనికి ఒకే ఒక్క చక్కని పరిష్కారం ఉంది. ఒకవేళ ఇరు ఇళ్ళ మధ్య ఖాళీ ప్రదేశం ఉండి సరిహద్దు గోడ లేకపోతే, వెంటనే పక్కింటి వారిని కాంపౌండ్ వాల్ కట్టుకోమని చెప్పాలి. లేదా మీ ఇంటి హద్దుల్లో మీరే ఒక బలమైన కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకోవాలి. అలా మీ ఇంటికి ఒక రక్షణ గోడ ఏర్పడిన మరుక్షణమే పక్కింటి వాస్తు ప్రభావం మీపై పూర్తిగా తొలగిపోతుంది.












Click it and Unblock the Notifications