సంపాదన చేతిలో నిలవాలంటే 6 వాస్తు సూత్రాలను పాటించాలి
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన దైనందిన జీవితంలో ఆర్థిక వనరులే కీలకం. అయితే చాలామంది రాత్రింబవళ్లు కష్టపడి సంపాదిస్తారు. కానీ, ఆ డబ్బు చేతిలో అస్సలు నిలవదు. ఎంతొచ్చినా అంతా ఖర్చయిపోతూ ఉంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా పాటించాల్సిన ఆరు అద్భుతమైన వాస్తు పరిహారాలను నిపుణులు చెప్పారు. వాటిగురించి తెలుసుకుందాం.
మీ పర్సు ఇలా ఉంచుకోండి
ధన ప్రవాహానికి మనం వాడే పర్సు మొదటి మెట్టు. మీ వాలెట్ ఎప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా ఉండాలి. పొరపాటున కూడా చిరిగిన పర్సులను వాడకండి, ఇది మీ ఆర్థిక స్థితిని దిగజారుస్తుంది. వాస్తు ప్రకారం ఎరుపు, ఆకుపచ్చ లేదా నలుపు రంగు వాలెట్లు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. మీ పర్సులో ఒక చిన్న వెండి నాణెం లేదా ఒక బియ్యం గింజను ఉంచుకోవడం వల్ల అది సంపదను ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది.

వంటగదిలోని స్టవ్ మెయింటెనెన్స్
మన ఆరోగ్యాన్నే కాదు, ఆర్థిక స్థితిని కూడా శాసించే శక్తి వంటగదికి ఉంది. ముఖ్యంగా మీరు వాడే గ్యాస్ స్టవ్ ఎప్పుడూ మురికిగా ఉండకూడదు. స్టవ్ మురికిగా ఉంటే ఆర్థిక వృద్ధి స్తంభించిపోతుంది. రోజూ వంట పూర్తయ్యాక స్టవ్‌ను నీట్‌గా క్లీన్ చేయాలి. అలాగే, స్టవ్‌కు ఉండే అన్ని బర్నర్లను సమానంగా వాడుతూ ఉండాలి. వీలైతే వారంలో కొన్ని రోజులైనా పసుపు రంగు ఆహార పదార్థాలను వండి నివేదించడం శుభప్రదం.
పడుకునే దిశ కూడా ముఖ్యమే
మీరు పడుకునే బెడ్‌రూమ్ వాస్తు కూడా మీ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. రాత్రి పూట నిద్రించేటప్పుడు ఎల్లప్పుడూ దక్షిణం లేదా తూర్పు వైపునకు తల పెట్టి పడుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. అలాగే, ఇంటి యజమాని బెడ్‌రూమ్ ఎప్పుడూ ఇంటి నైరుతి మూలలో ఉండటం ఎంతో శ్రేయస్కరం.
ఇంట్లోని చెత్తను, విరిగిన వస్తువులను వదిలించుకోండి
ఇంట్లో అనవసరమైన గందరగోళం నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుంది. ముఖ్యంగా విరిగిపోయిన వస్తువులు, పగిలిన అద్దాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఇవి లక్ష్మీ దేవికి శత్రువుల వంటివి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ ఖాళీగా, ప్రశాంతంగా ఉంచాలి. అక్కడ బరువైన లేదా పనికిరాని వస్తువులు పెడితే తీవ్ర ఆర్థిక నష్టాలు తప్పవు.
ఉప్పుతో దరిద్ర నివారణ
వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించే అద్భుత శక్తి ఉంది. ఒక చిన్న గాజు గిన్నెలో కల్లుప్పు వేసి ఇంట్లోని మూలల్లో ఉంచాలి. వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ వైబ్స్ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక కష్టాలను క్రమంగా దూరం చేస్తుంది.
ఉత్తర దిశలో కుబేరుని కటాక్షం
హిందూ పురాణాల ప్రకారం ఉత్తర దిక్కుకు అధిపతి సంపద దేవుడైన కుబేరుడు. కాబట్టి, ఇంటి ఉత్తర భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, తెరిచి ఉంచాలి. ఈ ప్రదేశంలో ఒక అందమైన పాత్రలో స్వచ్ఛమైన నీటిని పోసి, అందులో కొన్ని తాజా పూలను ఉంచండి. ఈ చిన్న పరిహారం కుబేర స్వామిని మీ ఇంటి వైపు ఆకర్షించి, శ్రేయస్సును కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications