వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - అమలైకాదశి అంటే ఏమిటి..? ఈ సమయంలో ఎలా ఉండాలి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఏకాదశి పండుగలు:- ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు
1.శుక్ల పక్షము ,
2. కృష్ణ పక్షము ...
పక్షానికొక ఏకాదశి చొప్పున .. ఇరవైనాలుగు ఏకాదశి లుంటాయి. ప్రతి నెల ఆమావాస్యకి, పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి. ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధ ఏకాదశి" అని అంటారు. సంవత్సరం మొత్తంలో ఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. ప్రతి నెల అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశి ని "బహుళ ఏకాదశి" అని అంటారు సంవత్సరం మొత్తంలో ఇటు వంటి బహుళ ఏకాదశులు 12 ఉంటాయి. అంటే శుక్లపక్ష, కృష్ణ పక్షమిలో వచ్చే మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఫాల్గుణమాసము శుక్లపక్షమిలో వచ్చే ఏకాదశికి అమలైకాదశి అని పేరు, ఇలా మాస మాసంలో వచ్చే ఏకాదశులకు వివిధ పేర్లతో పిలుచుకుంటారు.

చంద్రుడు ప్రభావం మన దేహంపై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. గడ్డి కూడా ఓషధమే, దాన్ని వినియోగించుకొనే క్రమం తెలిస్తే. ఈ భూమి మీద అంకురించిన వాటిలో ఓషధిగా పనిచేయనిదంటూ ఏమీ లేదు అని నిరూపిస్తాడు నాగార్జునుడు అనే వైద్యశాస్త్రంలో నైపుణ్యం కల ఒక మహనీయుడు. వాటి వల్ల మన శరీరం పెరుగుతూ ఉంటుంది. శరీరానికి అవసరం అయిన ఆయా ఓషధులని ఇచ్చే భూమికి ఆయా ఓషధులని పండించే శక్తిని చంద్రుడు ఇస్తాడు. వాటి వల్ల పెరిగే మన శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో అంగంపై చంద్రుడు ప్రభావితం చేస్తాడు. అంటే మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి ఇలా కొన్ని ఉన్నాయి.

 What is Ekadasi, what is its importance and when does Phalguna shuddha ekadasi occur?

చంద్రుడు ఒక్కోక్కరోజు తన కళలను పెంచుకుంటూ పోతాడు పూర్ణిమ వరకు. ఆపై ఒక్కోక్కరోజు తన కళలను తగ్గించుకుంటూ పోతాడు అమావాస్య వరకు. ఇక్కడ మనం చెప్పుకునేది గ్రహాల కదలిక వల్ల ఏర్పడే చంద్రుడి కాంతి గురించి కాదు. మనకు కనిపించని విషయాలను శాస్త్రాలు చెబుతాయి. పూర్ణిమ వరకు పెరిగే చంద్రుడు మొదటి పది రోజులు అంటే దశమి వరకు ఒక్కోనాడు ఒక్కో జ్ఞానేంద్రియంపై ఆపై ఒక్కోనాడు ఒక్కో కర్మేంద్రియంపై ప్రభావం చూపిస్తాడు. ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సుపై పదకొండోరోజు ప్రభావం చూపిస్తాడు. పదకొండునే ఏకాదశం అని అంటారు. పన్నెండో నాడు ద్వాదశి, ఆనాడు మనస్సుకు వెనకాతల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు. ఆ బుద్ధికి వెనకాతల అహంత మరియూ మూల ప్రకృతి అని రెండు తత్వాలు ఉన్నాయి, వాటిపై తరువాతి రెండు రోజులు ప్రభావితం చేస్తాడు. ఆపై ఉన్న తత్వం జీవుడు. పూర్ణిమనాడు కానీ అమావాస్య నాడు కానీ జీవుడిపై ప్రభావితం చూపిస్తాడు.

కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనల్ని ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లాన్ని బుద్ధి అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృజించాడు. లోపలి ప్రపంచం వైపు దృష్టి ఉంచడం కష్టమే, అయితే ఆయా ఇంద్రియాన్ని ఎంత వరకు వాడు కోవాలో తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇంద్రియాల్ని నియంత్రించేవే వాటి పైన ఉండే మనస్సు మరియూ బుద్ధి. ఈ శరీరంతో జీవుడి యాత్ర సుఖంగా సాగాలి అంటే మనస్సుని నిగ్రహంగా, బుద్ధిని స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది. మనస్సు అనేది ప్రధానమైనది. మనకు మన పైన ఉండే ప్రవృత్తులకు మనస్సే మధ్య ఉండేది. మనస్సే కారణం మనం బాగుపడటానికి కానీ నాశనం అవడానికి కానీ. "మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః" అని మన ఇతిహాస పురాణలు చెప్పాయి.

ఈ మనస్సును జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతావి జాగ్రత్తగానే జరుగుతాయి అని అంటారు. మనస్సుని వాడుకోవడం అనేది తెలియాలి. మనస్సుకి వెనకాతల ఉన్న బుద్ధికి బలం బాగుంటే మంచి నిర్ణయాలు జరుగుతాయి. బుద్ధి అంత బాగా లేకుంటే నిర్ణయాలు చెడిపోతాయి. అంటే ఈ రెంటిని ఎట్లా వాడుకోవాలో తెలుపడానికి పద్దతిని సూచించారు, అవే ఏకాదశి - ద్వాదశి తిధులు. మనస్సుకి భౌతికమైన చింతన తగ్గాలి, ప్రశాంతత కలగాలి. బుద్ధికి మాత్రం సాత్విక శక్తి పెరగాలి. పట్టుదల అనేది బుద్ధి లక్షణం కాబట్టి అది గట్టిగా ఉండాలి. మనస్సు అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందిన విషయాలవైపు ఎట్లా పడితే అట్లా వెళ్తుంది, దానికి బుద్ధి యొక్క ఆధారం అవసరం. మనస్సు అనేది నిర్ణయం తీసుకుంటే, బుద్ధి వెనకాతల బలపరుస్తుంది. తీసుకున్న నిర్ణయం సరియైనది కావాలంటే, మనస్సు యొక్క లక్షణమైన తమస్సుని తగ్గించాలి. మనం తీసుకొనే ఆహారం భూమినుండి వచ్చిందే. భూమికి తామస గుణం ఎక్కువపాల్లో ఉంటుంది. కనుక మన శరీరానికి ఇచ్చే ఆహారం తగ్గించాలి మనస్సు కోసం. నిర్ణయాన్ని భలపరిచే శక్తి బుద్ధిది కనుక దానికి సాత్విక శక్తి పెంచాలి. అది కూడా మనం తినే ఆహరం వల్ల పెంచాలి.

ఏకాదశి నాడు ఆహారం తగ్గిస్తారు, ద్వాదశి నాడు తెల తెలవారే సమయాన్నే ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే మనస్సు మీద చంద్రుడు పనిచేసేది ఏకాదశి నాడు కనుక ఆహారాదులని ప్రక్కన బెడితే చంద్రుడు తన శక్తిని మనస్సుపై నేరుగా ప్రసరింపజేయగలడు. తమస్సు యొక్క ప్రభావం మనస్సుపై తగ్గుతుంది. వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రాలు మనస్సు అనేది సాత్వికాహంకారం నుండి వచ్చింది అని చెబుతాయి. అందుకనే ఏకాదశి నాడు చేయాల్సినవి ఆహారం తగ్గించడం, భగవన్నామాన్ని అనుసంధించుకోవడం మరియూ మిగతా ఇంద్రియాలని మేల్కొని ఉంచేట్టు చేయడం. ఇవి చేసి మనస్సుకు తామస గుణాన్ని తగ్గించడం అనేది నియమం. తరువాతి నాడు అంటే ద్వాదశినాడు, బుద్ధికోసం తెల తెల వారే సమయానికి అంటే సూర్య దర్శనం అవగానే ఆహారాన్ని అందించాలి. అది ప్రభావితం అవుతుంది. సత్వగుణం కలిగిన మనస్సుకి సత్వ గుణం కల బుద్ధి తోడైతే ఆలోచనలూ సరి అవుతాయి. నిర్ణయాలు సరి అవుతాయి, తద్వారా ఫలితాలు చెప్పనవసరం లేకుండానే మంచివవుతాయి. ఈ రెండు కలిపి ఒక్క వ్రతం అంటారు.

ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణం. ఏకాదశి నాడు చేసే ఉపవాసాన్ని ద్వాదశినాడు సమాప్తం చేయడమే పారణం అని అంటారు. రెంటిని వేరు వేరుగా చేయడం కూడా ఫలితమే అని చెబుతారు. అయితే ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి, రెండు సార్లు చేయాలి అనేదే నియమం. సంస్కృతంలో ఒక విషయం చెప్పారు "ఏకాదస్యాం అహోరాత్రాం కర్తవ్యం భోజనత్రయం". మామూలు రోజు రెండు సార్లు భోజనం చేస్తాం, కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అంటే మూడు సార్లు చేయాలని అర్థం అనుకునేరూ భో- జన- త్రయం అంటే మనుష్యులూ మీరు మూడు పనులు చేయాలి అని అర్థం. ఏమిటవి అంటే ఉపవాసం, హరి గుణ గానం మరియూ జాగరణం. ఈ మూడు కూడా భక్తిపూర్వకంగా ఇష్టంతో చేయాలి. ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది, ప్రేమతో హరి గుణ గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసం అని అంటారు. నిరంతరం తలుస్తూ ఉంటే నిద్ర రాదు, దాన్నే జాగరణం అని అంటారు. ఇది ప్రతి ఏకాదశికి నియమమే.

ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానం, గరుడ పురాణములో

ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి !
కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ !!

అని చెప్పబడినది. అనగా ఉపవాసం, దానం, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ద్వాదశినాడు విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు పేర్కొన్నాయి.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు? ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, గర్భిణిలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.

ఏకాదశినాడు ఏం తినవచ్చు:- ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు కొబ్బరి నీళ్ళు, తేనే నిమ్మరసం, పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి. శారీరక శక్తి కల్గినవారు చేస్తే మంచి ఆరోగ్యంతోబాటు పుణ్యఫలం దక్కుతుంది జై శ్రీమన్నారాయణ.

English summary
There are twenty four Ekadashis. This Ekadashi is performed every month before the new moon and the full moon. The Ekadashi that falls before Purnima every month is called "Shuddha Ekadashi"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X