చేతులు కలిపిన కాంగ్రెస్,సిపిఐ
హైదరాబాద్: త్వరలో జరుగనున్న జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని కాంగ్రెస్, సిపిఐ స్థూలంగా అంగీకారానికి వచ్చాయి. రెండు పార్టీల నేతలు పొత్తుకు తాము సుముఖంగా వున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో తెలుగుదేశంను పొత్తు వల్ల గట్టిగా ఎదుర్కోవచ్చని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. కాగా ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల జాబితాలను ఈ నెల 26 కల్లా ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం నియమించిన జిల్లా పరిశీలకులపై కాంగ్రెస్ కార్యకర్తలనుంచి తీవ్ర అభ్యంతరాలు వెలువడటంతో ఈ పరిశీలకులను సమన్వయకమిటీల నేతలుగా మారుస్తున్నట్టు పిసిసి ప్రకటించింది. పార్టీ స్థానిక నేతలతో సంప్రదించి ఈ సమన్వయ కమిటీల నాయకులు ఈ నెల 24 కల్లా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఖరారు చేస్తారు.
ఈ జాబితాలపై తుది నిర్ణయాన్ని 26లోగా తీసుకుంటారని పిసిసి అధికార ప్రతినిధి రోశయ్య చెప్పారు. రాష్ట్రమంతా విచ్చలవిడిగా తిరుగుతు కొత్త కొత్త పథకాలకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని రోశయ్య ఆరోపించారు. బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించకుండా, ఖజానాలో దమ్మిడి కూడా లేని స్థితిలో ఆదిలాబాద్‌లో 650 కోట్ల రూపాయలు వెచ్చించి పథకాలను చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు. తప్పుడు వాగ్దానాలు, హామీల వల్లనే ప్రజల్లో అసంతృప్తి, అశాంతి రేకెత్తుతాయని ఆయన హెచ్చరించారు..












Click it and Unblock the Notifications