ఐటి కోర్సులకు తగ్గిన డిమాండ్
ముంబాయి: అమెరికాలో మాంద్యం ప్రభావం కారణంగా ఐటి కోర్సులపై అభ్యర్ధుల ఆసక్తి సన్నగిల్లడంతో అనేక శిక్షణా సంస్థలు దుకాణాలు మూసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి వున్నదని అంటున్నారు. అయితే, ఐటి బూమ్ సమయంలో తామతరంపరగా వెలసిన శిక్షణా సంస్థలు మూతపడుతున్నా ఈ రంగంలో దీర్ఘకాలంగా వుంటున్న సంస్థలకు ఇప్పట్లో వచ్చే ముప్పు ఏమీలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐటి శిక్షణ సంస్థల పరిస్థితిపై ఈ మధ్యనే ఐసిఐసిఐ సెక్యురిటీస్ ఒక సర్వే జరిపింది. ముంబాయి, బెంగుళూరు, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్ వంటి కేంద్రాల్లో శిక్షణ సంస్థల జోరు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని అంటున్నారు. స్వల్పవ్యవధి కోర్సులు, ఉద్యోగం గ్యారంటీ పేరుతో వచ్చిన కోర్సులకే ముప్పు ఏర్పడింది తప్ప, దీర్ఘకాలిక దృష్టితో నిర్వహిస్తున్న కోర్సులకు డిమాండ్ ఎప్పటిలాగానే వున్నదని ప్రముఖ శిక్షణా సంస్థలు అంటున్నాయి.
కంప్యూటర్స్‌కు సంబంధించిన మౌలిక అంశాల స్థాయినుంచి శిక్షణ ఇవ్వగల కోర్సులకుడిమాండ్ ఎప్పటికీ వుంటుందని, అప్పటికప్పుడు ఉద్యోగం చూపగల స్వల్పకాలిక కోర్సుల భవిష్యత్తు మాత్రం తాత్కాలికమేనని ఆప్టెక్, ఎన్‌ఐఐటి వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications