ఆంధ్ర బిజెపి అధ్యక్షుడుచిలకం రాజీనామా
హైదరాబాద్‌ః బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు చిలకం రామచంద్రా రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపికి సరిగా సారధ్యం వహించ లేకపోయినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చిలకం నిర్ణయించుకున్నారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తికి పంపినట్లు చిలకం సన్నిహితులు చెప్పారు.
ఈనెల 12,15 తేదీల్లో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో బిజెపి నామ మాత్ర స్థానాలు కూడా గెలుచుకోలేక పోయింది. కేంద్రంలో అధికారంలో వుండడం, రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ బిజెపి కేవలం ఏడు మండలాలను, 13 జడ్.పి.టి.సి.లను మాత్రమే గెలుచుంది. తెలుగుదేశం పార్టీతో సరిగా పొత్తుపెట్టుకోవడంలో కూడా బిజెపి విఫలం అయింది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు ఇస్తుండడంతో రాష్ట్రంలో చంద్రబాబును ఏమీ అనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితికి రాష్ట్ర బిజెపి భారీ మూల్యమే చెల్లించుకన్నది. తెలుగుదేశంతో కలిపి 44 జడ్.పి.టి.సిలలో పోటీ చేసిన బిజెపి ఆరింటిలో మాత్రమే గెలుపొందింది. సొంతంగా 144 జడ్.పి.టి.సిల్లో పోటీ చేసిన బిజెపి ఏడింటిలో మాత్రమే గెలుపొందడం బిజెపి వర్గాల్లో కలవరం రేపింది. తెలుగుదేశం పార్టీకి దాసోహంఅంటూ బిజెపి ఉనికిని కోల్పోతున్నదంటూ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఆత్మావలోకన ప్రక్రియలో చిలకం రాజీనామా తొలిమెట్టు కావాలని వారి ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications