కరవు అధ్యయనానికి కేంద్రబృందం రాక
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్ని తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్రబృందం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తుంది. కరవు పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిస్తుంది. రాష్ట్రంలోని 22 జిల్లాలలో కరవు తీవ్రంగా వుందంటూ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ప్రకటించింది. కరవు సహాయ చర్యలకోసం తక్షణం 850 కోట్లు రూపాయలు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రాన్ని కోరింది. అయితే పనికి ఆహారం పథకం కింద 3 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
కేంద్ర బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పర్యటిస్తుంది. ఈ బృందం రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటిస్తుంది. మరోజట్టు కడప జిల్లాలో పర్యటిస్తుంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాస్త పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తామని కరవు బృందం లోని సభ్యులు స్పష్టం చేశారు.
బీహార్ పై లోక్ సభలో రభస
బీహార్ లో వరద బాధితులకు రబ్రీ దేవి సర్కార్‌సరైన సాయం అందించడం లేదంటూ వివిధ రాజకీయ పార్టీలు సోమవారం లోక్ సభలో ధ్వజమెత్తాయి. పలుసార్లు నిరసన తెలుపుతూ వెల్ లోకి దూసుకు వచ్చారు. బీహార్ వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయంఅందించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications