వచ్చే మూడురోజులు భారీ వర్షాలు..ఉత్తర తెలంగాణాలో ముసురు!
తెలంగాణా ప్రజలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే ఎండలు, వడగాలులలో ఇబ్బంది పడి, వర్షాల కోసం ఎదురు చూస్తున్న వారికి వర్షాలు పడతాయని చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జులై 3వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముసురువానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఉత్తర తెలంగాణా జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో పింక్ అలెర్ట్ జారీ చేశారు. ఇక్కడ రోజుకు 100 నుంచి 120 మి.మీ వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో రోజుకు 50 నుంచి 80 మి.మీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

కొన్ని జిల్లాలలో బ్లూ అలెర్ట్
బ్లూ అలర్ట్ జిల్లాల్లో 15 నుంచి 45 మి.మీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక మరోవైపు హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్ లో మోస్తరు వర్షాలకు ఛాన్స్
భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చిరుజల్లులు, సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో నగరవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండిపోతున్న పంటలకు, అడుగంటుతున్న భూగర్భజలాలకు ఈ వర్షాలు ఊరట ఇస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పొలాల్లో పని చేసేవారు చెట్ల కింద ఉండకూడదని, సెల్ ఫోన్లు వాడకూడదని అంటున్నారు. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి ఎంతో మంచిదని, ఇప్పటికైనా ముసురు వర్షాలు పడి, పంటలకు కావలసిన నీరు అందితే బాగుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications