దేశ రక్షణలో జవాన్.. ఊరిలో భూమి మాయం?.. సైనికుడు మహేష్ ఆవేదన! (వీడియో)
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న ఓ సైనికుడికి సొంత ఊరిలోనే రక్షణ కరువైంది. జమ్మూకశ్మీర్ లో విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జవాన్.. తన సొంత భూమిని కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని రక్షిస్తున్న సైనికుడి ఆస్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
బాధిత జవాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ సైనికుడి పేరు భాష్యం మహేష్. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో సైనికుడిగా దేశానికి సేవలు అందిస్తున్నారు. తమ్మడపల్లి గ్రామంలో ఆయనకు 2 ఎకరాల 38 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అయితే స్థానిక తెలుగుదేశం పార్టీ మహానంది మండల ఇంఛార్జీ కంచర్ల శివ, ఆయన అనుచరులు కలిసి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆయన నేరుగా ఆరోపించారు.

ఈ భూ ఆక్రమణ యత్నంపై ఇప్పటికే బాధితుడు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి న్యాయం జరగలేదని మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. " మేము ఇక్కడ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిలబెడితే.. మా సొంత ఊరిలో మా ఆస్తులకు రక్షణ కరువైంది. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు" అంటూ ఆ సైనికుడు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే ఈ విషయమైన జోక్యం చేసుకోవాలని జవాన్ మహేష్ విజ్ఞప్తి చేశారు. కూటమి సర్కారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి.. భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తన భూమిని తనకు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ జవాన్ ఆవేదనతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications