అమరావతిలో మొదటి ప్రారంభం- రాజధానిలోకి రాయల్ ఎంట్రీ
రాజధాని అమరావతి నిర్మాణంలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అమరావతి మౌలిక వసతుల కల్పనలో అత్యంత కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు ప్రారంభం కాబోతోంది. రయ్యిమంటూ రాజధానిలోకి అడుగు పెట్టడం సులభతరమౌతుంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా భావించే ఈ రోడ్డును ఈ ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోడ్డును ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు.
దీంతో పాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. మొత్తం మూడు దశల్లో ఈ సీడ్ యాక్సెస్ ఈ-3 రోడ్డు నిర్మితమైంది. దీనికోసం ప్రభుత్వం 1,519 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. ఈ రెండూ అందుబాటులోకి రావడం వల్ల రాజధానిలోకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది.

రాజధాని పనులకు ఈ ప్రారంభోత్సవాలు నూతన జవసత్వాలు ఇవ్వనున్నాయి. రెండో విడత పనుల్లో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లిలోని పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్లు, కొండవీటివాగు, గుంటూరు ఛానల్‌పై 280 మీటర్ల పొడవుతో మరో వంతెనను నిర్మించారు. ఈ రెండు వంతెనల నిర్మాణానికి సుమారు 82 కోట్ల రూపాయల వ్యయం అయింది.
ఈ వంతెనల ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా ఇంగ్లీష్ అక్షరం ఏ ఆకారంలో ఓ భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులోకి రావడం వల్ల విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి నేరుగా అమరావతిలోకి ప్రవేశించవచ్చు. ప్రత్యేకించి.. కృష్ణానది కరకట్ట రహదారిపై పెరిగిపోతోన్న ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.
మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ-3 కారిడార్ అమరావతి గ్రిడ్‌లోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉండే కీలకమైన అంతర్గత రహదారులన్నింటినీ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో రాజధానిలో తలెత్తే వాహన రద్దీని తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. దొండపాడు నుంచి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారి-16 వరకు ఈ రహదారి సాగుతుంది.
మూడు దశల్లో సుమారు 1,519 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ 60 మీటర్ల వెడల్పు గల 9- లేన్ల రహదారి.. రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చనుంది. ఇందులో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ లేన్లు, 11 మీటర్ల వెడల్పు గల సర్వీస్ రోడ్లతో పాటు సైకిల్ ట్రాక్‌లను కూడా అభివృద్ధి చేశారు. రోడ్డు తవ్వకాల భయం లేకుండా విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ కేబుల్స్ కోసం భూగర్భంలోనే అధునాతన యుటిలిటీ లైన్లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications