బాలయ్య పేరు మీద టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
సినిమా రంగంలో రికార్డులు పుట్టడం, ఆ తర్వాత కాలక్రమేణా ఇంకో చిత్రంతో బద్దలు కావడం సాధారణమే. కానీ, టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని, చెక్కుచెదరని ఒక అరుదైన రికార్డు ఉంది. అదే ఒకే కేలండర్ ఇయర్‌లో ఏకంగా ఆరు సినిమాలతో 'డబుల్ హ్యాట్రిక్' (100 రోజులు) సాధించిన ఘనత! నందమూరి నటసింహం బాలకృష్ణ పేరుమీద టాలీవుడ్ లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. తన నటనా ప్రస్థానంలో 1986వ సంవత్సరం ఒక సువర్ణ అధ్యాయం. ఎవరికీ సాధ్యపడని రీతిలో, ఆ ఒక్క ఏడాదిలోనే ఆయన నటించిన 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను నమోదు చేసి, 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి.
ముందుగా 'ముద్దుల కృష్ణయ్య'
ఈ చారిత్రాత్మక విజయాల్లో భాగంగా ఫిబ్రవరి 28న విడుదలైన 'ముద్దుల కృష్ణయ్య' పల్లెటూరి నేపథ్యంలో సంచలన విజయం సాధించగా, మద్రాసులోని 'వల్లువార్ కొట్టం'లో జరిగిన దీని వంద రోజుల వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక కాలేజీ విద్యార్థిగా, లవర్ బాయ్‌గా బాలయ్య నటించిన 'సీతారామ కళ్యాణం' శ్లాబ్ సిస్టమ్‌లో ఒక స్టార్ హీరో సినిమా రోజుకు 5 ఆటలతో 100 రోజులు ప్రదర్శితమయ్యేలా చేసింది. జూలైలో వచ్చిన 'అనసూయమ్మ గారి అల్లుడు' చిత్రం ద్వారా బాలయ్య తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బంద్, కోస్తాంధ్రలో భారీ వరదలు వంటి ఇబ్బందులు ఎదురైనా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించి శతదినోత్సవం జరుపుకుంది.

మాస్ యాక్షన్ తో 'దేశోద్ధారకుడు'
వీటితో పాటు మాస్ యాక్షన్, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన 'దేశోద్ధారకుడు', సెప్టెంబర్‌లో విడుదలై ఇందులోని పాటకు టాలీవుడ్‌లో 'బ్రేక్ డ్యాన్స్' సంస్కృతికి తెరలేపిన 'కలియుగ కృష్ణుడు' వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇక దసరా కానుకగా అక్టోబర్‌లో వచ్చిన 'అపూర్వ సహోదరులు' చిత్రం బాలయ్య కెరీర్‌లో తొలి ద్విపాత్రాభినయం కావడం విశేషం. అప్పట్లో అత్యధిక బిజినెస్ రేట్లతో ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. మహామహులైన నటులకైనా సాధ్యం కాని రీతిలో ఏకధాటిగా సినిమాలు విడుదల చేస్తూ, ప్రతి సినిమాను శతదినోత్సవాలు దాటించడం కేవలం బాలయ్య కే చెల్లింది. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో మల్టీప్లెక్స్ కల్చర్, వీకెండ్ కలెక్షన్‌లు, కొద్ది రోజుల్లోనే థియేటర్లు మారే ట్రెండ్‌లో ఈ రికార్డును మళ్లీ రిపీట్ చేయడం ఏ హీరోకైనా సాధ్యం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు నిలిచిపోయే ఈ గ్రేట్ రికార్డు నందమూరి బాలకృష్ణ మాస్ స్టామినాకు, బాక్సాఫీస్ స్ట్రెంత్‌కు అసలైన నిదర్శనంగా నిలిచింది.














Click it and Unblock the Notifications
