యూట్యూబర్ వైష్ణవి నుండి హరిబాబు హత్యదాకా.. రీల్స్ క్రైం కథాచిత్రం... సొసైటీకి పెను ప్రమాదం!
సోషల్ మీడియా సామాన్యుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి, తమ ఆలోచనలను పంచుకోవడానికి ఒక బ్రహ్మాండమైన వేదిక. దీనిని ఎవరు కాదనలేదు. కానీ అదే సోషల్ మీడియాను ఎంతవరకు వినియోగించాలి? ఏ విషయాలు అందులో చర్చించకూడదు? అనే విషయం కచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి.
యూట్యూబ్ వీడియోలు, రీల్స్ మనుషుల జీవితాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న వేళ.. వైష్ణవి నుంచి హరిబాబు వరకు క్రైమ్ కథ చిత్రంలో ఏం జరిగిందో గమనిస్తే ఈ హత్యలకు ఒక రకంగా సోషల్ మీడియా కూడా కారణం అన్నది అర్థమవుతుంది.వైష్ణవి నుండి హరిబాబు వరకు జరిగిన హత్యలు, ఆ తర్వాత పరిణామాలు.. సమాజం పైన వీటి ప్రభావం అన్న అంశాల పైన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కటుకం శంకర్ తో వన్ ఇండియా ప్రతినిధి మాట్లాడినప్పుడు అనేక ఆలోచింపచేసే అంశాలు తెలిశాయి.

గర్భిణిగా ఉన్న youtuber వైష్ణవి హత్య, వైష్ణవి హతమార్చాడని ఆరోపణలు ఎదుర్కొన్న హరిబాబు హత్య వెనుక రీల్స్ ప్రభావం, యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం కచ్చితంగా ఉందని ఆయన తెలిపారు. ఈ హత్య కేసులలో వారి మానసిక స్థితి పైన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతగా ఉందో ఆయన స్పష్టం చేశారు.
రీల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా వైష్ణవి సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది. అయితే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త హరిబాబుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అన్నది ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమైంది. సోషల్ మీడియా ద్వారా హరి బాబు తప్పు చేస్తున్నాడని చెబుతూ వైష్ణవి చేసిన రచ్చ ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చింది. రీల్స్ ద్వారా వచ్చే వ్యూస్ కోసం వైష్ణవి చేసిన పని ఆమె హత్యకు ఒక కారణమైంది.
నాలుగు నెలల గర్భిణీ గా ఉన్న youtuber వైష్ణవి హత్య తర్వాత సోషల్ మీడియాలో క్రియేట్ అయిన హైప్ వైష్ణవి కుటుంబంలో కొత్త ఆలోచనలకు కారణమైంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో వైష్ణవి కుటుంబం మాట్లాడిన మాటలు, హరిబాబు వైష్ణవిని చంపేశాడని చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరిబాబుని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
ఇదిలా ఉంటే ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన హరిబాబు తన తల్లి లక్ష్మితో కలిసి నిజామాబాద్ లో ఉంటున్న విషయం తెలుసుకొని, వైష్ణవి సోదరుడు సంతోష్ అతడిని దారుణంగా హతమార్చాడు. ఆపై సోషల్ మీడియాలో తానే చంపినట్టు వీడియో పోస్ట్ చేశాడు. వైష్ణవి ఫోటో వద్దకు వెళ్లి సినీ ఫక్కీలో నిన్ను చంపిన వాడిని చంపాను అంటూ, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అంటూ మళ్లీ ఒక రీల్ చేశాడు.
ఆపై పోలీసులు హరిబాబు ని చంపిన సంతోష్ ను అరెస్ట్ చేశారు. సంతోష్ అరెస్ట్ తర్వాత సంతోష్ భార్య సానియా, తన భర్త వైష్ణవిని చంపిన వాడిని చంపి పగ తీర్చుకున్నాడు అని, తను చేసింది తప్పు కాదని చెప్పింది. తన భర్త బయటకు రావాలంటే అందరి సపోర్ట్ కావాలంటూ మరొక రీల్ చేసి పోస్ట్ చేసింది. రెండు హత్యలకు సంబంధించి మొత్తం ఎపిసోడ్లో మానవ సంబంధాల కన్నా సోషల్ మీడియానే ప్రధానమైనదిగా మారడం వల్లే ఇటీవల పరిణామాలు చోటు చేసుకున్నాయని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ కటుకం శంకర్ అభిప్రాయపడ్డారు.
జనాలు సపోర్ట్ చేస్తే హత్య చేసినా బయటపడవచ్చు అన్న అభిప్రాయం వారికి ఉంది అంటే వారి మానసిక స్థితి పైన సోషల్ మీడియా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నారు. సహజంగా హత్య చేసిన తర్వాత తానే చంపానని రీల్ చేసి పెట్టడం, తనని సపోర్ట్ చేయాలని కోరడం వంటి చర్యలు సమాజంలో సోషల్ మీడియా కారణంగా చోటు చేసుకుంటున్న మానసిక స్థితి పైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
రియల్ లైఫ్ కు రీల్ లైఫ్ కు మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకుంటే ఇటువంటి హత్యలు, దారుణాలు జరగవని సోషల్ మీడియాకు ఖచ్చితంగా పరిమితి ఉండాలని చెబుతున్నారు. నేరాలు పెరుగుతున్న వేళ సోషల్ మీడియా పోస్టుల పైన మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, లేదంటే ఈ తరహా కేసులు పెరిగే ప్రమాదం ఉందని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కటుకం శంకర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగించే వారు పరిధి, పరిమితి తెలుసుకుని వాడితే మంచిదని సలహా ఇస్తున్నారు.













Click it and Unblock the Notifications
