మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.. ఇది తథ్యం: తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘంలో తెరవెనుక చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నాయి. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన దారి తప్పిందనడానికి తాజా ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐఆర్ కు సంబంధించి ఈసీ స్వయంగా కమిషనర్ల మధ్యే తీవ్రస్థాయిలో లోతైన విభేదాలు బయటపడ్డాయి. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కొన్ని కీలకమైన విధానపరమైన నిర్ణయాలు వెలువడుతున్నాయంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీవ్ర అసంతృప్తిని రికార్డుల్లో నమోదు చేశారు.
దీనిపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈసీపై ఘాటు విమర్శలు సంధించారు. ఓట్ చోరీ అనేది దేశ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద నేరమని, రాజ్యాంగ బద్ధమైన సంస్థలు, వ్యవస్థలపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు. ఈసీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం, అధికారులను స్పష్టంగా హెచ్చరిస్తోన్నానని, వాళ్లు చేస్తోన్నది పూర్తిగా తప్పు అని అన్నారు. ఓట్ చోరీ అంశం దేశద్రోహమని మండిపడ్డారు. "మాకూ ఒక సమయం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని పట్టుకుని తీరతాం. మా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.." అని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఈసీ ముమ్మాటికీ దేశద్రోహానికి ఒడిగట్టాయని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల అక్రమాలను ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా నిర్వహించారని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్య కిందకే వస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పక్షపాతంగా సాగాల్సిన ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవస్థలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని, వారు చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదనీ హెచ్చరించారు.
Vote chori is a crime against the Indian people and a direct attack on our constitution.
— Rahul Gandhi (@RahulGandhi) September 23, 2026
The BJP, RSS and EC who organised it have committed an act of treason.
Justice will be served. pic.twitter.com/30kX06CBiH
ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరపాలని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా కోరుకుంటోన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం తన స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమవుతోందని, ఓటింగ్ ప్రక్రియపై సామాన్య ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications
