కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు బిగ్ షాక్..
తెలంగాణలోని పేద మహిళలకు ఆర్థిక సాయం కోసం తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాలకు శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా.. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్. వీ. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తీసుకొచ్చిన పథకాలకు నిధులు ఖర్చుచేయడం చెల్లదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై గతంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధిస్తూనే.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. దాంతో తదుపరి విచారణ సెప్టెంబర్ 9 వ తేదీన జరగనుంది. తదుపరి విచారణ వరకు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయరాదని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతులకు వివాహం సమయంలో ఆర్థిక సాయం చేయడం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను 2014 లో ప్రారంభించింది. ఆ తర్వాత వీటి పరిధిని బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం ఈ పథకాల కింద అర్హులైన ప్రతి యువతికి రూ. 1,00,116 ఆర్థిక సాయం అందుతుంది. వధువుకు కచ్చితంగా 18 ఏళ్లు నిండాలనే నిబంధన కారణంగా బాల్య వివాహాలు తగ్గుతాయని అప్పటి ప్రభుత్వం భావించింది.

అయితే ఈ పథకాలపై న్యాయవాది విజయ్ గోపాల్ ధర్మాసనం ముందు మాట్లాడుతూ ఎటువంటి చట్టపరమైన నిబంధనల మద్దతు లేకుండానే ఈ పథకాలను రూపొందించి అమలు చేశారన్నారు. ఆదాయ పరిమితులతో సహా అర్హత ప్రమాణాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారనే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఈ రెండు పథకాల కోసం భారీ మొత్తంలో ప్రజా నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.












Click it and Unblock the Notifications