రాయలసీమలో ఇదీ పరిస్థితి.. నీళ్లు లేక వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండానే..
తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు, ఐదో రోజు ముగిసిన నేపథ్యంలో వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి బయల్దేరుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు సరిగా లేక వినాయకుడి నిమజ్జానికి ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా రాయలసీమలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా వినాయకుడి నిమజ్జనానికి అక్కడ తీవ్రమైన ఆటంకం ఏర్పడుతోంది. ఎల్ నినో ప్రభావంతో చెరువులు, బావుల్లో నీళ్లు లేక విగ్రహాలకు అక్కడే వదిలేసి వెళ్తున్నారు భక్తులు. రాయలసీమలోని పుట్లూర్, యెల్లనూర్ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ మండలాల్లోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కాని వినాయకుడి విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువులు, బావులు, నదుల వద్దకు తీసుకొచ్చినా నీరు లేని కారణంగా అక్కడే వదిలేసి వెళ్తున్నారు. అటు నీటి కొరతతో పశువుల పరిస్థితి కూడా రాయలసీమ ప్రాంతంలో అధ్వానంగా మారినట్లు స్పష్టం అవుతోంది.
ఇక నీళ్లు లేక ఎండిపోయిన భూముల మధ్య వినాయకుడి విగ్రహాలు ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఈ దృశ్యాలు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల్లో విగ్రహాల సైజును బట్టి నిమజ్జనం చేసేందుకు అధికారులు పలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ మేరకు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఈ వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ క్రమంలో ఎస్పీ జగదీశ్ జెండా ఊపి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం నిమజ్జనం రూట్లను ఆయన తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సాఫీగా వినాయకుడి విగ్రహాల శోభాయాత్ర సాగేలా భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications
