ఎస్సీ/ఎస్టీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం!
ఎస్సీ/ఎస్టీ (అఘాయిత్యాల నివారణ) చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన బాధితులకు ఇచ్చే పరిహారాన్ని 40 శాతానికి పైగా పెంచాలని ప్రతిపాదించింది.
వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) పెరుగుదలకు అనుగుణంగా ఈ చట్టం కింద బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం నేరం స్వభావం, తీవ్రతను బట్టి పరిహారం రూ. 85,000 నుంచి రూ. 8.25 లక్షల మధ్య అందించబడుతోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం కనీస పరిహారాన్ని రూ.1 లక్షకు, గరిష్ట పరిహారాన్ని రూ.12 లక్షల వరకు పెంచనున్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే 2016 తర్వాత పరిహారం పరిమిత పెరగడం ఇదే తొలిసారి కానుంది. ప్రస్తుతం ఈ ఫైల్ వ్యయ ఆర్థిక కమిటీ ఆమోదం కోసం పంపబడింది.

ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, కేంద్రం నిధులు
షెడ్యూల్డ్ కుల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గాలపై జరిగే అఘాయిత్యాలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు ఒకేసారి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కూడా ప్రతిపాదిస్తోంది. ఈ పోలీస్ స్టేషన్ల నిర్వహణకు అయ్యే ఖర్చులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. అఘాయిత్యాల కేసులను ఎదుర్కోవడానికి సంస్థాగత మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ చట్టం ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వీలు కల్పించినప్పటికీ, కేవలం ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే అలా చేశాయి.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సమర్పించిన ఓ నివేదికలో, సామాజిక న్యాయం, సాధికారతపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ సంస్థాగత యంత్రాంగాలు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది.
ప్రస్తుతం రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి?
" ఎస్సీ/ఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలకు పైగా గడిచినా, కేవలం ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే ఇటువంటి పోలీస్ స్టేషన్లు ఉండటం కమిటీని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం అవసరమని కమిటీ భావిస్తోంది. అఘాయిత్యాలు జరిగినప్పుడు, బాధితులు రక్షణ కోసం మొదట పోలీస్ స్టేషన్లనే ఆశ్రయిస్తారు. ఈ పోలీస్ స్టేషన్లు అటువంటి పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలవు" అని కమిటీ పేర్కొంది.
పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం, బీహార్ (40), మధ్యప్రదేశ్ (51), ఛత్తీస్‌గఢ్ (27), జార్ఖండ్ (24), కర్ణాటక (33), కేరళ (మూడు), పుదుచ్చేరి (మూడు) రాష్ట్రాలలో మొత్తం 181 ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ వ్యత్యాసం ప్రత్యేకంగా స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, అటువంటి కేసుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు లేవు.














Click it and Unblock the Notifications