Form 7: 7561 ముస్లిం ఓట్ల తొలగింపుకు విఫలయత్నం ? బళ్లారి బీజేపీ నేతపై కేసు..!
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున తమకు నచ్చనివాళ్లు, ప్రత్యర్దుల ఓట్లను తొలగించేందుకు దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కర్నాటకలో ఏకంగా 761 మంది ముస్లింల ఓట్లను ఫామ్ 7 (form 7)ద్వారా తొలగించేందుకు జరిగిన ఓ కుట్ర బయటపడింది. ఎన్నికల అధికారులకు అనుమానం వచ్చి ఈ దరఖాస్తుల్ని తిరస్కరించినా, మళ్లీ అభ్యంతరాలు చెప్పి వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వ్యవహారం బయటికి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేశారు.
కర్నాటకలోని బళ్లారి సిటీ అసెంబ్లీ స్ధానం పరిధిలో బీజేపీ (BJP) బీఎల్ఏగా ఉన్న స్దానిక కార్పోరేషన్ ప్రతిపక్ష నేత శ్రీనివాస్ మోత్కూర్ తనకు ఉన్న అవకాశాన్ని వాడుకుని ఫామ్ 7ను సమర్పించడం ద్వారా 7561 ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేశారు. ఇందులో అత్యధికంగా ముస్లిం ఓట్లే ఉన్నాయి. వీటిని తొలగించేందుకు ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో తిరిగి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారుల్ని ఆయన ఆశ్రయించారు.

సెప్టెంబర్ 21న తాము 7561 ఓట్లు తొలగించాలంటూ ఫామ్ ఇచ్చినా బీఎల్వోలు తిరస్కరిస్తున్నారంటూ బళ్లారి మున్సిపల్ కార్పోరేషన్ కు విపక్ష నేతగా ఉన్న బీజేపీ బీఎల్ఏ శ్రీనివాస్ మోత్కూర్ ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. చాలా మంది బీఎల్వోలు తాను ఇచ్చిన ఫామ్ 7ను తిరస్కరిస్తున్నారని, కొందరు మాత్రమే ఆమోదిస్తున్నట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ తర్వాత ఆయనే నేరుగా మిగిలిన ఫామ్ 7 దరఖాస్తుల్ని తీసుకుని ఈఆర్వోలను ఆశ్రయించారు. అక్కడా బీఎల్వోలు తమ ఫామ్ 7 దరఖాస్తులు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఈఆర్వోలు కూడా పట్టించుకోకపోవడంతో ఆయా పేర్లను జాబితాలో చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బీఎల్ఏలు రోజుకు కేవలం 10 ఫామ్ 7 దరఖాస్తుల్ని మాత్రమే ఒకేసారి సమర్పించవచ్చని, మొత్తం మీద 30కు మించి ఇలాంటి దరఖాస్తులు సమర్పిస్తే మాత్రం ఈఆర్వో, ఏఈఆర్వో వ్యక్తిగతంగా పరిశీలిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన ఇచ్చిన దరఖాస్తుల్ని అధికారులు తిరస్కరించారు. దీంతో పాటు ఫామ్ 7 దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ నేత శ్రినివాస్ మోత్కూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.














Click it and Unblock the Notifications
