ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా - ఢిల్లీ కొత్త లెక్కలు..!!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గ్రేటర్ ఎన్నికల వేళ ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా నిలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బై పోల్ లో పోటీ కోసం ఆశావాహుల పోటీ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి అభ్యర్ధి దాదాపు ఖరారు చేసారు. బీజేపీ నుంచి తొలుత ఒక మాజీ ఎమ్మెల్యే పేరు ప్రచారంలో ఉంది. అయితే, తాజాగా ఢిల్లీ నాయకత్వం లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఖైరతాబాద్ అభ్యర్దిగా కొత్త పేరు తెర మీదకు వస్తోంది. రాష్ట్ర నేతల తో చర్చించిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
దానం నాగేందర్ పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే ఈ మేరకు నియోజకవర్గం సీటు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ కోసం దానం నాగేందర్ సమాయత్తం అవుతున్నారు. అదే సమయంలో విజయా రెడ్డి సైతం తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడికి సీటు ఖరారైనట్లు చెబుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు మరో సారి తెర మీదకు వచ్చింది. ఆయనకే తిరిగి సీటు ఇస్తారని భావిస్తున్న వేళ ఢిల్లీ నేతల లెక్క మాత్రం మరో విధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకొని.. అదే సమయంలో గ్రేటర్ ఎన్నికలు రానుండటంతో... ఇక్కడి అభ్యర్ధి విషయంలో పార్టీ నాయకత్వం అభ్యర్ధి విషయంలో కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

బీజేపీ కొత్త వ్యూహాలు
బీజేపీ నాయకత్వం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే విధంగా వ్యూహాలు అమలు చేయాలని.. కాంగ్రెస్- ఎంఐఎం కు ధీటుగా ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటికే కీలక దిశా నిర్దేశం జరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో బీజేపీ తరపున హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన కొంపెల్లి మాధవీలత ఈసారి ఖైరతబాద్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో 3,23,894 ఓట్లు సాధించారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రయోజనం ఉండే విధంగా ఖైరతాబాద్ అభ్యర్ధిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో చీకోటి ప్రవీణ్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే.. చింతల రామచంద్రారెడ్డి సుదీర్ఘ కాలంగా బీజేపీలో ఉండటంతో ఆయనకు సీటు ఇవ్వటం సరైన నిర్ణయంగా పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా.. భవిష్యత్ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ నాయకత్వం ఎవరికి సీటు ఖరారు చేస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
