జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోన్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోన్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటీషన్లపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బ్యాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్, ఈసీ ఐటీ విభాగం డీజీ సీమా ఖన్నాలకు నోటీసులు పంపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

జ్ఞానేష్ కుమార్.. కమిషన్‌లోని మిగిలిన ఇద్దరు సభ్యుల అభ్యంతరాలను పక్కనబెట్టి సుమారు 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ రాకేశ్ కుమార్ సింగ్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు. ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదనలను వినిపించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ నిర్ణయాల్నీ కూడా ఏకగ్రీవంగా గానీ, మెజారిటీ సభ్యుల ఆమోదంతో గానీ తీసుకోవాల్సి ఉంటుందని, దీనికి విరుద్ధంగా సీఈసీ వ్యవహరించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక లోటుపాట్లు ఉన్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని వికాస్ సింగ్ ధర్మాసనానికి వివరించారు. వీటన్నింటికీ జ్ఞానేష్ కుమార్ బాధ్యుడని పేర్కొన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని, ఈ దిశగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లేకపోతే దేశంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తోన్న ఆందోళనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారమ్ 6 సవరణలపైనా సొంత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. సీఈసీని సస్పెండ్ చేస్తే ఎన్నికల కమిషన్ విధులకు ఆటంకం కలుగుతుందని, ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని వికాస్ సింగ్ ను ప్రశ్నించింది. తగిన ఆధారాలు లేకుండా పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఆరోపణలను సమర్థించలేమని, అవి వాస్తవమేనని నిర్ధారించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదనలను కూడా వినాల్సి ఉందని తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం, ఈసీకి నోటీసులు పంపింది.
మరో పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠి తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై ఐటీ నిపుణుల సహాయంతో సమగ్రమైన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ కు చెందిన ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్ వంటి డేటాబేస్ వ్యవస్థల పనితీరుపై కూడా ఆడిట్ జరగాలని మేనకా గురుస్వామి పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 32 కింద బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 16.10 లక్షల మంది ఓటర్ల చేరికను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లు నిబంధనలకు విరుద్ధంగా సాగాయని పిటిషనర్ పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
