పిడుగుపాటుకు నేలకొరిగిన కేరళ ప్రసిద్ధ గజరాజు 'పల్లాట్ బ్రహ్మదత్తన్'
కేరళ ఆలయ ఉత్సవాల్లో తన గంభీరమైన రూపంతో ఎంతగానో అలరించిన గజరాజు పల్లాట్ బ్రహ్మదత్తన్.. ఇక లేదు. గజకౌస్తుభం గా పిలుచుకునే ఈ భారీ ఏనుగు విషాదకర రీతిలో కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం కేరళలో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. కొట్టాయం సమీపంలోని మేళంబరలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావటి ఇంటి వద్ద కట్టేసి ఉన్న సమయంలో పిడుగుపాటుకు గురైంది.
కేరళ ఫెస్టివల్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ రాజేష్ పల్లాట్ కు చెందిన టస్కర్ అది. ఆదివారం మధ్యాహ్నం బ్రహ్మదత్తన్ ఏనుగును సురక్షితంగా కట్టేశారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడ్డాయి. దీని బారిన పడ్డ ఈ ఏనుగు స్పృహ కోల్పోయింది. దీంతో రాజేష్ పల్లాట్.. అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ.. ఆ గజరాజును కాపాడుకోలేకపోయారు.

బ్రహ్మదత్తన్ మరణవార్త తెలియడంతో వేలాది మంది వన్యప్రాణి ప్రేమికులు, ఆలయ ఉత్సవ నిర్వాహకులు శోకసంద్రంలో మునిగిపోయారు. 10 అడుగులకు పైగా ఎత్తుతో ఎంతో రాజసంగా కనిపించే బ్రహ్మదత్తన్ ను మలయాళీలు గజకౌస్తుభంగా పిలుచుకొంటారు. దశాబ్దాల కిందట బీహార్ నుండి కేరళకు తీసుకువచ్చారు దీన్ని. మొదట్లో పుతుపల్లి బ్రహ్మదత్తన్ అని పిలిచేవారు. దీని సంరక్షణ బాధ్యతలను పల్లాట్ ఫ్యామిలీ తీసుకున్న తర్వాత పల్లాట్ బ్రహ్మదత్తన్ గా గుర్తింపు పొందింది.
కేరళ వ్యాప్తంగా అన్ని ఉత్సవాల్లో ఈ ఏనుగును ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రఖ్యాత త్రిశూర్ పూరం పండగలో పరమేక్కావు తరఫున ఈ ఏనుగు అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది. ఉత్సవ మూర్తి 'తిడంబు'ను మోసే అరుదైన గౌరవం ఈ ఏనుగుకు చాలాసార్లు దక్కింది. బ్రహ్మదత్తన్ లేనిదే కేరళ సెంట్రల్ రీజియన్ లో ఏ ఆలయ ఉత్సవం కూడా జరిగేది కాదు. ఇటువంటి అరుదైన ఏనుగులు రాబోయే తరాల ఉత్సవాల్లో కనిపించడం చాలా కష్టమని భక్తులు విచారం వ్యక్తం చేస్తోన్నారు.
బ్రహ్మదత్తన్ మరణంతో కేరళ సంప్రదాయ ఆలయ ఉత్సవ సంస్కృతిలో ఒక అద్భుత సువర్ణాధ్యాయం ముగిసిపోయినట్టయింది. భారీ ఆకారం, గంభీరమైన నడక, మనస్సుకు హత్తుకునే సాధు స్వభావంతో అందరినీ అమితంగా ఆకట్టుకునే ఈ గజరాజు ఇక లేడనే నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, అది చూపిన అచంచలమైన ప్రేమ చిరస్మరణీయంగా మిగిలిపోతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
