ఆడవాళ్ల జోలికి వెళ్తే ప్రాణాలు దక్కవు.. అనేలా భయం పుట్టించాలి: సుప్రీంకోర్టు సంచలనం
దేశ రాజధానిలో మహిళల భద్రత, శాంతిభద్రతలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, మైనర్ బాలికలపై చోటు చేసుకుంటోన్న వరుస అత్యాచార సంఘటనలను సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి పలు ఆదేశాలు ఇచ్చింది.
ఢిల్లీ వీధుల్లో రాత్రి 10 గంటల సమయంలో ఓ సాధారణ మహిళ ఒంటరిగా నడిచినా, మెట్రో రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించినా తాము పూర్తిగా సురక్షితంగా ఉన్నామనే ధీమా ఉండట్లేదని పేర్కొంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము సురక్షితంగా ఇంటికి వెళ్తామనే ధైర్యాన్ని, అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. ఏదైనా నేరం జరిగిన తర్వాత అధికారులు దర్యాప్తు చేయడం కంటే అసలు నేరమే జరగకుండా దాన్ని నిరోధించడమే ప్రాధాన్యత కలిగిన అంశమని వ్యాఖ్యానించింది.

నేర ప్రవృత్తి కలిగి ఉండి, మహిళలపై దారుణాలకు పాల్పడే వారి మనస్సుల్లో చట్టం, పోలీసు వ్యవస్థ అంటే వణుకు పుట్టించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. ఇకపై ఏదైనా తప్పు చేస్తే మన ప్రాణాలు దక్కవు.. అనే భయాన్ని అల్లరి మూకలలో సృష్టించలేకపోతే.. ఇలాంటి దారుణాలను అదుపు చేయడం అసాధ్యమని పేర్కొంది. నిఘా వ్యవస్థలో లోపాలు ఏవైనా ఉంటే, వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకోకముందే తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సూచించింది.
ఢిల్లీలో నేరాలు అధికంగా చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా నిరంతరం పర్యవేక్షించడానికి శాశ్వత నిఘా యంత్రాంగం, ప్రత్యేక వ్యవస్థ ఏమైనా ఉందా అని జేబీ పార్దీవాలా బెంచ్.. ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, సున్నిత ప్రాంతాలను అనుక్షణం కెమెరాలతో స్క్రీనింగ్ చేయాలని పేర్కొంది. ఏదైనా సమస్య తలెత్తిన క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని స్పందించేలా పోలీస్ సిబ్బంది, తగినన్ని వాహనాలు అందుబాటులో ఉండేలా ఎలాంటి కార్యాచరణను రూపొందించారో వివరించాలని ఈ బెంచ్ అధికారులను ఆదేశించింది.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను అత్యవసరంగా గుర్తించడం, రాత్రి సమయాల్లో సరిపడా పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నగరంలోని వీధి దీపాల పరిస్థితి, చీకటిమయంగా ఉండే రహదారులు, సీసీటీవీ కెమెరాల పనితీరుపై సమగ్రంగా భద్రతా ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని గత విచారణల సమయంలో ఆదేశించిన విషయాన్ని బెంచ్ ఈ సందర్భంగా గుర్తుచేసింది.
రాజధానిలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు వీలుగా తీసుకున్న ఖచ్చితమైన విధివిధానాలు, క్షేత్రస్థాయి చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. కాగితాల్లో చట్టాలు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, రాత్రి వేళల్లో మహిళల భద్రతను మెరుగుపరచడం ద్వారానే చట్టంపై ప్రజలకు గౌరవం, నేరగాళ్లలో భయం ఏర్పడుతుందని అభిప్రాయపడింది.














Click it and Unblock the Notifications
