అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2 వేలకు పైగా కోళ్లు మృతి.. అధికారులు అప్రమత్తం!
అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్‌లో ఏకంగా రెండు వేలకు పైగా కోళ్లు వరుసగా మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఫామ్ యజమాని వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, అధికారులు రంగంలోకి దిగారు.
చనిపోయిన కోళ్ల నమూనాలను ముందుగా విజయవాడ ల్యాబ్‌కు, తర్వాత భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో H5 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక బృందం వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.

ఈ కోళ్లు హైదరాబాద్ తెలంగాణ నుంచి తెచ్చిన నాటు కోళ్లు కావడం గమనార్హం. గత నెల చివరలో ఒక్క రోజులోనే వేల సంఖ్యలో మరణించాయి. అధికారులు ఫామ్ చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి నిఘా పెంచారు. వ్యాధి వ్యాప్తి కాకుండా నిరోధక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పశుసంవర్ధక, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
కోళ్ల ఫామ్ యజమానులు, స్థానికులకు తగిన జాగ్రత్తలు సూచించారు. చికెన్, గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలని, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరిగ్గా ఉడికించిన చికెన్ తినడం వల్ల మనుషులకు ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు. అయినా కొంతమంది నాన్‌వెజ్ ప్రియులు చికెన్‌కు బదులు సీఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనూ అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కూడా సర్వైలెన్స్ పెంచి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈసారి కూడా అదే తరహా చర్యలు తీసుకుంటున్నారు. ఫామ్‌లలో బయో సెక్యూరిటీ చర్యలు పాటించాలని, అనుమానాస్పద మరణాలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లో ఉందని, మరిన్ని కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా భయాందోళన చెందకుండా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
