హైదరాబాద్ మేయర్ పై దేశం పంతం
హైదరాబాద్:హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి వుండాల్సిందేనని బిజెపికి స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వరంగల్ కార్పొరేషన్ మరి కొన్ని మున్సిపాల్టీలను తాము తీసుకుని హైదరాబాద్‌ను టిడిపికి వదిలివేయడానికి బిజెపి అంగీకరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.
అయితే అలాంటి ఒప్పందాలేమీ లేవని ఒకవేళవున్నా ఇప్పుడు పట్టించుకోవల్సిన అవసరం లేదని బిజెపి నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల అనుభవం తర్వాత తెలుగుదేశంతో పొత్తుకు దూరంగా వుండాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర బిజెపి పదాధికారుల సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంతో ప్రమేయం లేకుండా ఒంటరిగానే బిజెపి పోటీ చేస్తున్నది.
పంచాయతీ ఎన్నికల విషయం ఎలా వున్నా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బల్దియా మేయర్ పదవి విషయంలో కూడా బిజెపి అడ్డం తిరగడం తెలుగుదేశం నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్న కారణంగా హైదరాబాద్ మేయర్ పదవి తమకే దక్కాలని తెలుగుదేశం పార్టీ చెబుతున్నది. ఇదే విషయం గతంలో బిజెపి నేతలకు తాము స్పష్టం చేసినట్టుగా కూడా వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications